Harish Rao: కొడంగల్ కు తరలించిన డెంటల్ కాలేజీని మళ్లీ తెచ్చుకుంటాం: హరీశ్ రావు

Harish Rao criticizes shifting of dental college to Kodangal
సిద్దిపేట బీడీఎస్ కాలేజీని కొడంగల్‌కు తరలించారంటూ హరీశ్ ఆగ్రహం
తమ ప్రభుత్వం రాగానే కాలేజీని తిరిగి సిద్దిపేటకు తీసుకొస్తామని వ్యాఖ్య
యువత డ్రగ్స్, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్నారని ఆందోళన
సిద్దిపేటకు మంజూరైన బీడీఎస్ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొడంగల్‌కు తరలించుకుపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కాలేజీని మళ్లీ సిద్దిపేటకు తీసుకొస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని వైశ్య భవన్‌లో ట్రస్మా ఆధ్వర్యంలో జరిగిన గురుపూజోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, ఒక సమాజ భవిష్యత్తు తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, దానికి ఉపాధ్యాయులే కీలకమని అన్నారు. తాము సిద్దిపేటను ఒక ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులపై అత్యంత ప్రభావం చూపేది ఉపాధ్యాయులేనని పేర్కొన్నారు. రేపటి సమాజాన్ని తీర్చిదిద్దే గురుతర బాధ్యత వారిపై ఉందని తెలిపారు.

ప్రస్తుతం యువత డ్రగ్స్, గంజాయి, ఆన్‌లైన్ గేమ్స్ వంటి వ్యసనాల బారిన పడుతోందని హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్య అనేది కేవలం ఉద్యోగాలు, ర్యాంకుల కోసమే కాకుండా, ఒక ఉత్తమ సమాజ నిర్మాణానికి ఉపయోగపడాలని అభిప్రాయపడ్డారు. విద్యార్థులను శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారుచేయడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని, గెలుపు ఓటములను తట్టుకునే స్ఫూర్తిని అవి అందిస్తాయని ఉపాధ్యాయులకు సూచించారు.

విద్యా రంగంలో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని అన్నారు. గురుపూజోత్సవం రోజున ప్రభుత్వం కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులనే కాకుండా ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా సత్కరించి వారి సేవలను గుర్తించాలని ఈ సందర్భంగా హరీశ్ రావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Harish Rao
Siddipet
Dental College
Kodangal
Revanth Reddy
BRS
Education Hub
Gurupujotsavam
Teachers
Telangana

More Telugu News