Manchu Manoj: 12 ఏళ్ల తర్వాత 'మిరాయ్' విజయంతో నా ఫోన్ మోగుతూనే ఉంది: మంచు మనోజ్

Manchu Manoj Says Phone Keeps Ringing After Mirai Success
  • ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉందన్న మంచు మనోజ్
  • నన్ను నమ్మిన దర్శక, నిర్మాతలకు రుణపడి ఉంటానని వ్యాఖ్య
  • నాతో పాటు నా కుటుంబాన్ని నిలబెట్టారన్న మంచు మనోజ్
పన్నెండేళ్ల తర్వాత తన సినిమా విజయం సాధించడంతో తన ఫోన్ నిరంతరం మోగుతోందని, ఈ రోజు ఎంతో ఆనందంగా ఉందని సినీ నటుడు మంచు మనోజ్ సంతోషం వ్యక్తం చేశారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం మొదటి రోజునే రూ. 27 కోట్లు వసూలు చేసింది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో మంచు మనోజ్ మాట్లాడుతూ, తనను నమ్మిన దర్శక నిర్మాతలకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనని అన్నారు. ఈ విజయం పట్ల తనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయని, ఇదంతా ఒక కలలా అనిపిస్తోందని అన్నారు. ఈ కథలో తనను భాగం చేసినందుకు దర్శకుడు కార్తీక్‌కు ప్రత్యేకంగా రుణపడి ఉంటానని మనోజ్ పేర్కొన్నారు.

గతంలో ఎక్కడికి వెళ్లినా సినిమా ఎప్పుడు చేస్తారని అడిగేవారని, బయటకు ధైర్యంగా సమాధానం చెప్పినప్పటికీ లోపల ఒక తెలియని భయం ఉండేదని ఆయన అన్నారు. అనేక సినిమాలు చివరి నిమిషంలో రద్దయ్యాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఒకటి తలిస్తే మరొకటి జరిగేదని ఆయన అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కార్తీక్ తనను నమ్మడం అదృష్టమని ఆయన కొనియాడారు. తనకు ఈ అవకాశం ఇవ్వడం ద్వారా తనను మాత్రమే కాకుండా, తన కుటుంబాన్ని కూడా నిలబెట్టారని అన్నారు. 'మనోజ్‌తో సినిమా వద్దని' చాలామంది చెప్పి ఉంటారని, అయినప్పటికీ విశ్వప్రసాద్ గారు ధైర్యంగా ఈ చిత్రాన్ని నిర్మించారని  ఆయన అన్నారు. 'మిరాయ్' వీఎఫ్ఎక్స్ టీమ్ తెలుగు సినిమా గర్వపడేలా చేసిందని మనోజ్ ప్రశంసించారు. "ప్రతి ఇంట్లో నుంచి మనోజ్ గెలవాలని కోరుకున్న వారందరికీ పేరుపేరునా పాదాభివందనం" అని ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
Manchu Manoj
Mirai
Teja Sajja
Karthik Ghattamaneni
Vishnu Manchu
Telugu cinema
Tollywood

More Telugu News