Road: చందాలతో నిర్మించుకున్న రోడ్డు వరదలో కొట్టుకుపోయింది.. రాజంపేటలో రైతుల ఆవేదన

Road washed away due to heavy rains in Rajampet
  • రూ.1.20 లక్షలు వెచ్చించి రోడ్డు నిర్మాణం
  • ఇటీవలి వర్షాలకు కొట్టుకుపోయిన మట్టి రోడ్డు
  • వంద ఎకరాల పంట పొలాల్లో ఇసుకమేటలు
పంట పొలాలకు వెళ్లేందుకు దారి కోసం రైతులంతా చందాలు వేసుకుని మట్టి రోడ్డును నిర్మించుకున్నారు. అయితే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆ రోడ్డు కాస్తా కొట్టుకుపోయింది. అంతేకాదు, వరదలకు పంటలు కూడా మునిగిపోయాయి. వరద తగ్గాక పొలాల్లో ఇసుకమేటలు ఏర్పడడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. తెలంగాణలోని రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన రైతులకు ఎదురైన కష్టమిది.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన కొందరు మూడు నెలల క్రితం రూ.1.20 లక్షలు పోగుచేసుకుని పొలాల్లోకి మట్టి రోడ్డు నిర్మించుకున్నారు. గ్రామంలోని 70 మంది రైతులు తమ పొలాల్లోకి రాకపోకలు సాగించేందుకు 3 కిలోమీటర్ల దూరంలోని ఈ రహదారే ఆధారం. అయితే, ఇటీవలి వర్షాలకు ఆ మట్టిరోడ్డుతో పాటు సుమారు వంద ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి.

అటు చందాలు వేసుకుని నిర్మించుకున్న రోడ్డు పోయి, ఇటు కష్టపడి సాగు చేసుకుంటున్న పంటను కోల్పోయి తీవ్ర నష్టాలపాలైన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పొలాలకు మట్టి రోడ్డు నిర్మించాలని, పంట నష్టానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
Road
Rains
Telangana
Farmers
Crop loss
Floods

More Telugu News