Brahmanandam: రాజకీయాల్లోకి రావడంపై బ్రహ్మానందం ఏమన్నారంటే..!

Brahmanandam clarifies his stance on entering politics
  • తనకు రాజకీయ నేపథ్యం లేదన్న బ్రహ్మానందం
  • రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టీకరణ
  • తన జీవితం సినిమాలకే అంకితమని వెల్లడి
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన జీవిత ప్రస్థానాన్ని అక్షరరూపంలోకి తీసుకొచ్చారు. 'ME and मैं' పేరుతో ఆయన రాసిన ఆత్మకథను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ, తన జీవితంలోని అనేక కీలక ఘట్టాలను, అనుభవాలను పంచుకున్నారు. తనకు రాజకీయ నేపథ్యం లేదని, రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదని ఆయన స్పష్టం చేశారు.

"నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి, నటనపై ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఇప్పటివరకు 1200 చిత్రాల్లో నటించానంటే అది నటరాజ స్వామి ఆశీర్వాదం, ప్రేక్షకుల అభిమానం వల్లే సాధ్యమైంది" అని బ్రహ్మానందం తెలిపారు. తన జీవితం సినిమాలకే అంకితమని, నటనను ఎప్పటికీ వీడనని ఆయన అన్నారు. "నా పదవికి రిటైర్మెంట్ ఇవ్వొచ్చేమో గానీ.. నా పెదవికి ఇవ్వలేను. చివరి వరకు నవ్విస్తూనే ఉంటాను" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

కష్టపడి పనిచేస్తే విజయం కచ్చితంగా వరిస్తుందని, ఈ విషయంలో వెంకయ్య నాయుడు తనకు ఎంతో స్ఫూర్తి అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే మీమ్స్ గురించి ప్రస్తావిస్తూ, "నన్ను కేవలం సినిమాలకే పరిమితం చేయకుండా 'మీమ్స్ బాయ్'గా మార్చారు. ఏ రూపంలోనైనా సరే పదిమందినీ నవ్వించడమే నా ప్రధాన లక్ష్యం" అని బ్రహ్మానందం అన్నారు. తన ఆత్మకథలో కేవలం తన జీవితానుభవాలనే రాశానని, వివాదాలకు తావులేదని ఆయన వివరించారు. 
Brahmanandam
Brahmanandam autobiography
ME and मैं
Venkaiah Naidu
Telugu cinema
comedian
politics
memes
Padma Shri

More Telugu News