Pakistani Doctor: పాకిస్థానీ డాక్ట‌ర్ నిర్వాకం.. ఆపరేషన్ మధ్యలో పేషెంట్‌ను వదిలేసి.. నర్సుతో గడిపిన వైనం!

Pakistani Doctor Abandons Patient During Surgery for Nurse
  • ఆపరేషన్ మధ్యలో రోగిని వదిలి వెళ్లిన అనస్థటిస్ట్
  • పక్క గదిలో నర్సుతో అనుచితంగా ప్రవర్తించిన వైనం
  • సహోద్యోగి చూడటంతో వెలుగులోకి వచ్చిన బాగోతం
  • తప్పు ఒప్పుకున్న పాకిస్థానీ డాక్టర్.. వ్యక్తిగత ఒత్తిడే కారణమన్న వాదన
  • యూకే నుంచి పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లిన వైద్యుడు
వైద్య వృత్తికే కళంకం తెచ్చే సంఘటన యూకేలో వెలుగు చూసింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి చికిత్స అందిస్తూ, ఆపరేషన్ మధ్యలోనే వారిని వదిలేసి ఓ వైద్యుడు నర్సుతో శృంగారంలో పాల్గొన్నాడు. ఈ దారుణమైన ఘటన గ్రేటర్ మాంచెస్టర్‌లోని టేమ్‌సైడ్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌కు చెందిన డాక్టర్ సుహైల్ అంజుమ్ (44) టేమ్‌సైడ్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ అనస్థటిస్ట్‌గా పనిచేస్తున్నారు. 2023 సెప్టెంబర్ 16న ఒక రోగికి గాల్‌బ్లాడర్ సర్జరీ జరుగుతుండగా, ఆయన అనస్థీషియా ఇచ్చారు. అయితే, ఆపరేషన్ కొనసాగుతుండగానే రోగిని మత్తులో అక్కడే వదిలేసి, పక్కనే ఉన్న మరో ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లారు. అక్కడ నర్స్ 'సి'తో ఆయన అనుచిత స్థితిలో ఉండగా, మరో సహోద్యోగి నర్స్ 'ఎన్‌టి' చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు.

సుమారు ఎనిమిది నిమిషాల తర్వాత డాక్టర్ అంజుమ్ తిరిగి వచ్చి ఏమీ ఎరగనట్టుగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన వైద్య ట్రైబ్యునల్ ముందు డాక్టర్ అంజుమ్ తన తప్పును అంగీకరించారు. "ఇది చాలా సిగ్గుచేటైన విషయం. దీనికి నేనే పూర్తి బాధ్యుడిని. రోగిని, నా సహోద్యోగులను, ఆసుపత్రి నమ్మకాన్ని వమ్ము చేశాను" అని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

తన కుమార్తె నెలలు నిండకుండా పుట్టడం, వైవాహిక జీవితంలోని తీవ్రమైన ఒత్తిడి కారణంగానే తాను ఆ క్షణంలో అలా ప్రవర్తించానని వివరణ ఇచ్చారు. "ఈ విషయం గుర్తుకొచ్చిన ప్రతీసారి నా గుండె ముక్కలవుతుంది. నా వృత్తి నాకు ప్రాణం. కానీ ఎలా జరిగిందో తెలియదు" అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన తర్వాత 2024 ఫిబ్రవరిలో ఉద్యోగం మానేసి పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లిన ఆయన, తనను క్షమించి యూకేలో మళ్లీ వైద్య వృత్తిని కొనసాగించేందుకు ఒక అవకాశం ఇవ్వాలని ట్రైబ్యునల్‌ను వేడుకున్నారు. ఈ సంఘటన తన జీవితంలో జరిగిన ఒకే ఒక తప్పిదమని, భవిష్యత్తులో పునరావృతం కాదని హామీ ఇచ్చారు.
Pakistani Doctor
Suhail Anjum
surgery negligence
Tameside Hospital
Greater Manchester
gallbladder surgery
anesthetist misconduct
nurse affair
medical ethics
UK news

More Telugu News