Telangana Rains: తెలంగాణలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Telangana Rains Today Heavy Rainfall Expected Across State
  • నిర్మల్, నిజామాబాద్ సహా ఐదు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక
  • వాగులో చిక్కుకున్న యువకుడిని తాళ్ల సాయంతో రక్షించిన పోలీసులు
  • వరద ఉద్ధృతికి మానేరు నదిలో చిక్కుకున్న నాలుగు ట్రాక్టర్లు
  • నిండుకుండలా నాగార్జున సాగర్.. ఆరు గేట్ల ఎత్తివేత
  • పిడుగుపాటుకు 94 గొర్రెల మృతి, పలుచోట్ల ఆస్తి నష్టం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలంగాణలో బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. హనుమకొండ జిల్లాలో అర్ధరాత్రి వేళ ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించి ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్న ఓ యువకుడిని పోలీసులు చాకచక్యంగా కాపాడారు.

ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌కు చెందిన గాజుల రాకేష్ గురువారం రాత్రి హుజూరాబాద్ నుంచి తన మోపెడ్‌పై తిరుగుపయనమయ్యాడు. మార్గమధ్యంలో తాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తున్నా, ఇంటికి వెళ్లాలనే తొందరలో కల్వర్టు దాటేందుకు సాహసించాడు. వరద ప్రవాహం ధాటికి అదుపుతప్పి వాహనంతోపాటు కిందపడిపోయాడు. వెంటనే తేరుకుని కల్వర్టు స్తంభాలను గట్టిగా పట్టుకుని, సాయం కోసం గట్టిగా కేకలు వేశాడు. అతడి అరుపులు విన్న స్థానికులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అరగంటకు పైగా నరకయాతన అనుభవించిన రాకేష్‌ను తాళ్ల సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

రాష్ట్రవ్యాప్తంగా వానల బీభత్సం 
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. నేడు, రేపు కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శుక్రవారం ఉదయంతో ముగిసిన 24 గంటల్లో అత్యధికంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల తీవ్ర నష్టం వాటిల్లింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగులు పడి 94 గొర్రెలు మృతి చెందాయి. మహబూబాబాద్ జిల్లాలో ఓ ఇంటిపై రెండుసార్లు పిడుగు పడటంతో పైకప్పు దెబ్బతిని, ఇంట్లోని ఓ మహిళ స్పృహతప్పి పడిపోయారు. కరీంనగర్‌ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల ప్రాంగణం నీట మునిగింది.

నిండుకుండలా జలాశయాలు
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో అధికారులు ఆరు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీటి సంవత్సరం (జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు)లో సాగర్ గేట్లు తెరవడం ఇది నాలుగోసారి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా భారీగా వరద వస్తుండటంతో 12 గేట్ల ద్వారా నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లాలో మానేరు నది ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఇసుక కోసం వెళ్లిన నాలుగు ట్రాక్టర్లు డ్రైవర్లతో సహా చిక్కుకుపోగా, వారిని పోలీసులు రక్షించారు.
Telangana Rains
Heavy Rains
Telangana Weather
Hyderabad Weather
Nirmal
Nizamabad
Karimnagar
Weather Alert
Rainfall Forecast

More Telugu News