మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తున్నారంటూ వైసీపీ ఆరోపణ... సీఎం చంద్రబాబు క్లారిటీ
- మెడికల్ కాలేజీలపై జగన్ అబద్ధాలు చెబుతున్నారన్న చంద్రబాబు
- నిర్మించకుండానే నిర్మించామని ప్రచారం చేసుకున్నారని విమర్శ
- తాము అమలు చేసేది పీపీపీ విధానమేనని స్పష్టీకరణ
- కాలేజీల నిర్వహణ ప్రభుత్వానిదేనని హామీ
- బెదిరింపులకు భయపడేది లేదని తేల్చిచెప్పిన సీఎం
ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు. మెడికల్ కాలేజీలు నిర్మించకుండానే, అన్నీ పూర్తి చేశామని జగన్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, ప్రభుత్వ విధానాలపై స్పష్టత ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని, ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనను విమర్శిస్తూనే, తమ హయాంలో జరిగిన అభివృద్ధిని చంద్రబాబు గుర్తుచేశారు. "ఒకప్పుడు రాయలసీమలో పదేళ్లలో ఎనిమిదేళ్లు కరవు ఉండేది. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లాను మేం అభివృద్ధి చేసి చూపించాం. నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరచడం, హార్టికల్చర్‌ను ప్రోత్సహించడం వల్లే ఇవాళ ఆ జిల్లా జీఎస్‌డీపీలో గోదావరి జిల్లాలను మించిపోయింది" అని వివరించారు. కేవలం వృథాగా పోయే నీటిని మాత్రమే బనకచర్ల కాలువలకు వినియోగిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు.