Edi Rama: అల్బేనియాలో మొట్టమొదటి 'ఏఐ' మంత్రి.. అవినీతిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అస్త్రం

Edi Rama Appoints AI Minister to Combat Corruption in Albania
  • ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐకి మంత్రి పదవి
  • అవినీతి నిర్మూలనే లక్ష్యంగా అల్బేనియా కీలక నిర్ణయం
  • 'డియెల్లా' పేరుతో వర్చువల్ మంత్రి నియామకం
  • ప్రభుత్వ టెండర్ల బాధ్యత ఇకపై ఏఐకే
  • నిర్ణయాల్లో 100 శాతం పారదర్శకత ఉంటుందన్న ప్రధాని
ప్రభుత్వ పాలనలో అవినీతిని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో అల్బేనియా ప్రభుత్వం ప్రపంచంలోనే ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేశ చరిత్రలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు మంత్రి పదవిని అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. 'డియెల్లా' అనే పేరుతో ఈ ఏఐ డిజిటల్ మంత్రిని తమ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు అల్బేనియా ప్రధాని ఎడి రామ గురువారం ప్రకటించారు.

ప్రభుత్వ టెండర్ల ప్రక్రియలో అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా చేయడమే 'డియెల్లా' ప్రధాన బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. "ప్రభుత్వ టెండర్లకు సంబంధించిన అన్ని నిర్ణయాలను ఇకపై డియెల్లానే పర్యవేక్షిస్తుంది. దీనివల్ల టెండర్ల కేటాయింపులో 100 శాతం పారదర్శకత సాధ్యమవుతుంది. ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రతి పనిలోనూ పూర్తి స్పష్టత ఉంటుంది" అని ఆయన వివరించారు. ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో ఉన్న టెండర్ల నిర్ణయాధికారాన్ని దశలవారీగా ఈ ఏఐకి బదిలీ చేయనున్నట్లు తెలిపారు.

'డియెల్లా' అంటే స్థానిక భాషలో సూర్యుడు అని అర్థం. ఈ ఏడాది జనవరి నుంచి ఇది ప్రభుత్వ ఆన్‌లైన్ సేవలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. దీనిని సంప్రదాయ అల్బేనియా దుస్తులు ధరించిన మహిళ రూపంలో చిత్రీకరిస్తున్నారు.

యూరోపియన్ యూనియన్‌లో చేరాలని లక్ష్యంగా పెట్టుకున్న అల్బేనియాకు అవినీతి ఒక ప్రధాన అవరోధంగా మారింది. ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన అవినీతి సూచీలో 180 దేశాల జాబితాలో అల్బేనియా 80వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలోనే అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం సాంకేతికతను ఆయుధంగా ఎంచుకుంది.
Edi Rama
Albania
Artificial Intelligence
AI Minister
Corruption
Government Tenders
Transparency

More Telugu News