YS Sharmila: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై మోదీ 'సైలెంట్ కిల్లింగ్' ఆపరేషన్ చేపట్టారు: షర్మిల

YS Sharmila Slams Modi Over Visakha Steel Plant Privatization
  • రూ.5 లక్షల కోట్ల భూముల కోసమే ప్రైవేటీకరణ కుట్ర అంటూ షర్మిల ఆరోపణలు 
  • బీజేపీకి టీడీపీ, జనసేన, వైసీపీల పూర్తి సహకారం ఉందని ఆగ్రహం
  • స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ ఎంపీలు ఏకమవ్వాలని పిలుపు
  • ఉక్కు పరిశ్రమ కోసం కాంగ్రెస్ పోరాటం ఆగదని స్పష్టీకరణ
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్' చేపట్టారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ భూములను కైవసం చేసుకునేందుకే ఈ కుట్ర జరుగుతోందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై ఎంబీ భవన్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

"విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ నాటకాలు ఆడుతోంది. రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపీలు బీజేపీకి వత్తాసు పలుతుకున్నారు. 2021లో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు... స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కేంద్రానికి లేఖ రాశారు. ఒకప్పుడు వాజ్‌పేయి హయంలో ప్రైవేటీకరణ చేయాలని అనుకుంటే అడ్డుపడ్డాను అని ఆయన గొప్పలు చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?

బీజేపీ ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉందంటే, అది ఆంధ్ర ఎంపీలు ఇచ్చిన మద్దతుతోనే. టీడీపీ, జనసేన బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకుంటే.. వైసీపీ రహస్య పొత్తు పెట్టుకుంది. స్వార్థ రాజకీయాల కోసం అందరు కలిసి బీజేపీని మోస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీల మధ్య ఐకమత్యం లేదు. పార్లమెంట్ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నాం అంటే ఒక్కరు మాట్లాడలేదు. పోలవరం ఎత్తు తగ్గించాం అని చెప్పినా ఐకమత్యం లేదు. ప్రజాస్వామయంగా ఎన్నికైన ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడాలి. 

విశాఖ స్టీల్ భూముల విలువ రూ.4 లేదా 5 లక్షల కోట్లు. 20 వేల ఎకరాల కోసం ప్రధాని మోదీ ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ చేపట్టారు. అందుకే రా మెటీరియల్ ఇవ్వడం లేదు... క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం లేదు... లాజిస్టిక్స్ ఇవ్వడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతోంది. పార్లమెంట్ వేదికగా రాష్ట్ర ఎంపీలు అందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ కోసం కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుంది" అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. 
YS Sharmila
Visakha Steel Plant
Vizag Steel Plant
Privatization
Andhra Pradesh
Narendra Modi
BJP
TDP
YSRCP

More Telugu News