Sunaina Devi: వరకట్న వేధింపులకు వివాహిత బలి.. ఆమె మృతదేహాన్ని చూసి తల్లి మృతి

Bihar woman killed for dowry mother dies of shock
  • బీహార్‌లోని భాగల్‌పూర్‌లో ఘటన
  • అత్తింటివారు గొంతు నులిమి చంపేశారని ఆరోపణలు
  • కూతురి మృతదేహాన్ని ఆసుపత్రిలో చూసిన తల్లి
  • షాక్‌తో కుప్పకూలి అక్కడే మృతి చెందిన వైనం
  •  బ్రెయిన్ హెమరేజ్ వల్లేనని వైద్యుల నిర్ధారణ
కట్నం కోసం అత్తింటివారే తన కూతురిని పొట్టన పెట్టుకున్నారన్న వార్త విని ఆ తల్లి గుండె తట్టుకోలేకపోయింది. బిడ్డ నిర్జీవ దేహాన్ని చూసి షాక్‌తో ఆమె కూడా ప్రాణాలు విడిచింది. గంటల వ్యవధిలోనే తల్లీకూతుళ్లిద్దరూ మరణించడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బీహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగిందీ ఘటన. నగరానికి చెందిన  సునైనా దేవికి అత్తింటివారితో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఆమె భర్తకు ఉద్యోగం లేకపోవడంతో అదనపు కట్నం తీసుకురావాలంటూ అత్తింటివారు ఆమెను తరచూ వేధించేవారని సమాచారం. ఈ క్రమంలోనే సునైనా దేవిని ఆమె అత్తింటివారు గొంతు నులిమి హత్య చేశారని పుట్టింటివారు ఆరోపిస్తున్నారు.

కూతురి మరణవార్త తెలియగానే, సునైనా తల్లి బబ్లీ దేవి తన బంధువులతో కలిసి భాగల్‌పూర్‌లోని జేఎల్‌ఎన్ ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ కుమార్తె మృతదేహాన్ని చూసి తట్టుకోలేకపోయిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు ఆమెను పరీక్షించి, తీవ్రమైన షాక్ కారణంగా బ్రెయిన్ హెమరేజ్ అయి మరణించినట్లు ధ్రువీకరించారు. అనంతరం సునైనా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించే విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్ది, పోస్టుమార్టం పూర్తి చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Sunaina Devi
Dowry harassment
Bihar
Bhagalpur
Murder
Brain Hemorrhage
JLN Hospital
Crime news
India news
Bubbly Devi

More Telugu News