Maoists: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్... కీలక నేత సహా 10 మంది మావోయిస్టుల మృతి

Chhattisgarh Encounter 10 Maoists Including Key Leader Killed
  • ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భద్రతా బలగాలకు భారీ విజయం
  • గరియాబంద్ జిల్లాలో జరిగిన భీకర ఎన్‌కౌంటర్
  • పది మంది మావోయిస్టులు హతం
  • మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గరియాబంద్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో ఒక కీలక నేతతో సహా పది మంది మావోయిస్టులు మరణించారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మనోజ్ అలియాస్ మోడెం బాలకృష్ణ ఉన్నట్లు గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రాఖేచా ధృవీకరించారు. మృతుల్లో ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రమోద్ కూడా ఉన్నాడు.

మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా భద్రతా సిబ్బంది గరియాబంద్ జిల్లా అటవీ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలోని కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెజల్యూట్ యాక్షన్) కమాండోలు, ఇతర రాష్ట్ర పోలీస్ విభాగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ సందర్భంగా మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు జరిగాయని రాయ్‌పూర్ రేంజ్ ఐజీపీ అమ్రేష్ మిశ్రా తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి అందిన సమాచారం ప్రకారం కనీసం ఎనిమిది మంది నక్సలైట్లు హతమయ్యారని ఆయన మొదట వెల్లడించారు.

ఆపరేషన్ కొనసాగే కొద్దీ మృతుల సంఖ్య పదికి చేరిందని ఎస్పీ నిఖిల్ రాఖేచా స్పష్టం చేశారు. అటవీ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని, ఆపరేషన్ ముగిసిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.
Maoists
Chhattisgarh
Gariaband
Naxalites
Manoj alias Modem Balakrishna
encounter
security forces

More Telugu News