Benjamin Netanyahu: ఖతార్ పై ఇజ్రాయెల్ దాడి.. విమర్శలను తిప్పికొట్టిన నెతన్యాహు

Netanyahu Justifies Israels Qatar Attack Citing Hamas Safe Haven
  • అక్టోబర్ 7 నాటి దాడులను అమెరికా ట్విన్ టవర్స్ దాడితో పోల్చిన ఇజ్రాయెల్ పీఎం
  • అమెరికా ఉగ్రవాదులను వేటాడినట్లే తామూ దాడులు చేస్తున్నామని వివరణ
  • హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టబోమని హెచ్చరిక
ఖతార్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేయడంపై పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే, ఈ దాడిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సమర్థించుకున్నారు. హమాస్ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టేది లేదని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 7న తమ భూభాగంపై హమాస్ ఉగ్రవాదులు చేసిన దాడిని అమెరికాలో జరిగిన 9/11 దాడులతో పోలుస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ట్విన్ టవర్స్ కూల్చివేత తర్వాత ఉగ్రవాదులు ఏ దేశంలో ఉన్నా వెంటాడి హతమారుస్తామని నాడు అమెరికా ప్రకటించిందని గుర్తుచేశారు. అల్ ఖైదా ఉగ్రవాదుల పట్ల అమెరికా స్పందించిన తరహాలోనే హమాస్ ఉగ్రవాదులపై తాము స్పందిస్తున్నామని నెతన్యాహు చెప్పారు. హమాస్ కు ఈ భూమ్మీద సురక్షితమైన ప్రదేశమనేదే లేకుండా చేయడమే తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. హమాస్ ఉగ్రవాద లీడర్లకు ఆశ్రయం కల్పించడం వల్లే దోహాలో దాడులు చేయాల్సి వచ్చిందని ఆయన వివరణ ఇచ్చారు.

హమాస్‌ కు ఆ దేశం సురక్షితమైన స్వర్గధామంగా మారిందని, ఉగ్రవాదులకు ఖతార్ నిధులు సమకూరుస్తోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గురువారం నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తమ చర్యలను ఖండిస్తున్న దేశాలను నెతన్యాహు తప్పుబట్టారు. ఆత్మరక్షణ కోసం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడే విషయంలో వెనుకడుగు వేయబోమని ఆయన స్పష్టం చేశారు. ఖతార్‌ సహా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే దేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ నెతన్యాహు హెచ్చరించారు.
Benjamin Netanyahu
Israel Qatar attack
Netanyahu criticism
Hamas terrorists
Doha attack
Israel defense
Qatar funding Hamas
Israel war
Gaza conflict
Middle East tensions

More Telugu News