Nepalese prisoners: భారత్-నేపాల్ సరిహద్దులో హై అలర్ట్.. 30 మంది ఖైదీల అరెస్ట్

30 Nepalese prisoners apprehended in Bihar UP Bengal border vigil stepped up
  • నేపాల్‌లో అల్లర్ల నడుమ జైళ్ల నుంచి తప్పించుకున్న ఖైదీలు
  • భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించగా భగ్నం చేసిన ఎస్ఎస్‌బీ
  • యూపీ, బీహార్, బెంగాల్ రాష్ట్రాల సరిహద్దుల్లో 30 మంది అరెస్ట్
  • భారత్-నేపాల్ సరిహద్దు వెంబడి భద్రత కట్టుదిట్టం
  • నేపాల్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపునకు ప్రత్యేక విమానాలు
నేపాల్‌లో నెలకొన్న అశాంతిని ఆసరాగా చేసుకుని అక్కడి జైళ్ల నుంచి తప్పించుకున్న ఖైదీలు భారత్‌లోకి ప్రవేశించేందుకు చేసిన యత్నాలను సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలు భగ్నం చేశాయి. దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన 30 మంది నేపాలీ ఖైదీలను ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నాయి. ఈ పరిణామంతో కేంద్ర భద్రతా ఏజెన్సీలు భారత్-నేపాల్ సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించాయి.

వివరాల్లోకి వెళితే... నేపాల్‌లో జరుగుతున్న హింసాత్మక నిరసనల మధ్య పలువురు ఖైదీలు జైళ్ల నుంచి పారిపోయారు. వీరిలో కొందరు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన ఎస్ఎస్‌బీ జవాన్లు సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేసి చొరబాట్లను అడ్డుకున్నారు. అరెస్టయిన వారిలో 17 మందిని ఉత్తరప్రదేశ్‌లో, మిగిలిన 13 మందిని బీహార్, పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాల్లో పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బుధవారం సాయంత్రం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. నేపాల్‌తో సరిహద్దు పంచుకుంటున్న పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామర్హి, మధుబని సహా ఏడు జిల్లాల్లో హై అలర్ట్ విధించారు. బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ అమృత్, డీజీపీ వినయ్ కుమార్‌తో కలిసి సరిహద్దు జిల్లాల డీఎంలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. చొరబాట్లను నిరోధించేందుకు ఎస్ఎస్‌బీ బలగాలతో కలిసి రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా గస్తీ నిర్వహిస్తున్నారు.

చిక్కుకున్న భారతీయులకు ఊరట
మరోవైపు, నేపాల్‌లో అల్లర్ల కారణంగా చిక్కుకుపోయిన భారతీయులకు ఊరట లభించింది. ఖాట్మండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో రాజస్థాన్‌కు చెందిన పలు కుటుంబాలు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు మార్గం సుగమమైంది. చిక్కుకున్న వారిని త్వరగా తరలించేందుకు కొన్ని రోజుల పాటు అదనపు విమానాలు నడపాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలను ఆదేశించింది.
Nepalese prisoners
Nepal
Nepal unrest
India Nepal border
SSB
Prison escape
Bihar
Uttar Pradesh
West Bengal
Indian citizens in Nepal
Kathmandu Airport

More Telugu News