Physiotherapists: ఫిజియో థెరపిస్టులు వైద్యులు కాదు.. వారు ‘డాక్టర్’ టైటిల్ ను వాడకూడదు.. ఆదేశాలు జారీ చేసిన కేంద్రం

Physiotherapists Cant Use Doctor Title Orders Central Government
  • ఫిజియోథెరపిస్టుల 'డాక్టర్' వాడకంపై డీజీహెచ్ఎస్ అభ్యంతరం
  • కొత్త ఫిజియోథెరపీ సిలబస్ నుంచి ఆ పదం తొలగించాలని ఆదేశం
  • దీనివల్ల రోగులు తప్పుదోవ పడతారని తీవ్ర ఆందోళన
  • ఫిజియో థెరపిస్టులు వైద్యులు కారని స్పష్టం చేసిన ఆరోగ్య శాఖ
  • గతంలో పలు కోర్టులు కూడా దీనికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చాయి
  • గందరగోళం లేని మరో గౌరవప్రదమైన టైటిల్ పరిశీలించాలని సూచన
ఫిజియోథెరపిస్టులు తమ పేర్ల ముందు 'డాక్టర్' (Dr) టైటిల్ ను ఉపయోగించడంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది రోగులను, సాధారణ ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ, ఈ నిబంధనను కొత్త ఫిజియోథెరపీ కరికులం నుంచి వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసిన "కాంపిటెన్సీ బేస్డ్ కరికులం ఫర్ ఫిజియోథెరపీ, 2025"లో ఫిజియోథెరపీ గ్రాడ్యుయేట్లు తమ పేరు ముందు 'డాక్టర్' అని, చివర 'పీటీ' (PT) అని చేర్చుకోవచ్చని సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనపై ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్ (ఐఏపీఎంఆర్) సహా పలు వైద్య సంస్థలు తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే డీజీహెచ్ఎస్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయంపై డీజీహెచ్ఎస్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీతా శర్మ మాట్లాడుతూ "ఫిజియోథెరపిస్టులు వైద్యులుగా శిక్షణ పొందరు. కాబట్టి వారు 'డాక్టర్' అనే పదాన్ని ఉపయోగించడం ప్రజలను, రోగులను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. ఇది క్వాకరీకి (నకిలీ వైద్యం) దారితీసే ప్రమాదం ఉంది" అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. వైద్యుల సిఫార్సు మేరకే ఫిజియోథెరపిస్టులు పనిచేయాలని, వారు ప్రాథమిక ఆరోగ్య సంరక్షకులుగా వ్యవహరించకూడదని కూడా లేఖలో సూచించారు.

కేవలం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్లు మాత్రమే 'డాక్టర్'ను వాడాలని గతంలో పాట్నా (2003), బెంగళూరు (2020), మద్రాస్ (2022) హైకోర్టులు తీర్పులు ఇచ్చిన విషయాన్ని డీజీహెచ్ఎస్ గుర్తుచేసింది. గుర్తింపు పొందిన వైద్య డిగ్రీ లేకుండా ఈ బిరుదును వాడటం 'ఇండియన్ మెడికల్ డిగ్రీస్ యాక్ట్, 1916'ను ఉల్లంఘించడమే అవుతుందని, ఇది చట్టపరమైన చర్యలకు దారితీస్తుందని హెచ్చరించింది.

ఈ క్రమంలో, వివాదాస్పద సిలబస్‌ను తక్షణమే సరిదిద్దాలని డీజీహెచ్ఎస్ ఆదేశించింది. ప్రజల్లో ఎలాంటి గందరగోళం సృష్టించని, ఫిజియోథెరపీ గ్రాడ్యుయేట్లకు మరింత గౌరవప్రదమైన మరో బిరుదును పరిశీలించవచ్చని సూచించింది.
Physiotherapists
DGHS
Doctor title
Health Ministry
Medical practice
Physiotherapy curriculum
IAPMR
Indian Medical Association
Fake medicine
Healthcare

More Telugu News