Hyderabad Amaravati Expressway: హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి ఇక రెండున్నర గంటలే.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్ ఖరారు

Hyderabad Amaravati Expressway Route Finalized Travel Time Reduced
  • గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే అలైన్‌మెంట్ దాదాపు ఖరారు
  • నాలుగున్నర గంటల ప్రయాణం రెండున్నర గంటలకు తగ్గింపు
  • ప్రస్తుత మార్గం కంటే 57 కిలోమీటర్లు తగ్గనున్న దూరం
  • ఫ్యూచర్ సిటీ నుంచి బందరు పోర్టు వరకు నిర్మాణం
  • 12 వరుసల రహదారిగా నిర్మించాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి
  • రహదారి పక్కనే హైస్పీడ్ రైలు మార్గం ఏర్పాటుకు కూడా ప్రతిపాదన
తెలుగు రాష్ట్రాల రాజధానులైన హైదరాబాద్, అమరావతి మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించేందుకు ప్రతిపాదించిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ఈ రహదారికి సంబంధించిన అలైన్‌మెంట్ దాదాపుగా ఖరారైంది. ఈ నూతన మార్గం అందుబాటులోకి వస్తే ప్రస్తుతం నాలుగున్నర గంటలు పడుతున్న ప్రయాణ సమయం కేవలం రెండున్నర గంటలకు తగ్గిపోతుంది.

ఎక్కడి నుంచి ఎక్కడి వరకు?
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) మధ్య ముచ్చర్లలో ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీకి సమీపంలోని తిప్పారెడ్డిపల్లి వద్ద ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం కానుంది. అక్కడి నుంచి ప్రస్తుత విజయవాడ జాతీయ రహదారికి కుడివైపుగా తెలంగాణలోని రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా ఇది సాగుతుంది. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి సమీపంలో అమరావతికి చేరుకుంటుంది. అక్కడి నుంచి లంకెలపల్లి మీదుగా బందరు పోర్టు వరకు ఈ రహదారిని అనుసంధానిస్తారు.

మొత్తం 297.82 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో తెలంగాణ పరిధిలో 118 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ పరిధిలో 180 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగనుంది. దీని ప్రకారం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి దూరం 211 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ప్రస్తుత మార్గంతో పోలిస్తే 57 కిలోమీటర్లు తక్కువ.

12 వరుసల రహదారి ప్రతిపాదన
ఈ ఎక్స్‌ప్రెస్‌వేను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 12 వరుసలతో నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. దీనికి కేంద్రం ఆమోదం లభిస్తే, ఇది దక్షిణ భారతదేశంలోనే తొలి 12 వరుసల ఎక్స్‌ప్రెస్‌వే అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తొలుత 6 లేదా 8 వరుసలతో నిర్మించి, దశలవారీగా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. భూసేకరణ, నిర్మాణ వ్యయం కలిపి ప్రాథమిక అంచనాల ప్రకారం దీనికి రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చవుతుందని భావిస్తున్నారు.

ఇతర కీలక అనుసంధానాలు
ఈ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుబంధంగా మరిన్ని కీలక ప్రాజెక్టులు రానున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేయాలనుకుంటున్న డ్రైపోర్టును ఈ రహదారితో అనుసంధానించాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల డ్రైపోర్టు నుంచి నేరుగా బందరు పోర్టుకు సరుకు రవాణా సులభతరం అవుతుంది. ఇదే మార్గం వెంట హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా నిర్మించాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.
Hyderabad Amaravati Expressway
Amaravati
Hyderabad
Greenfield Expressway
Telangana
Andhra Pradesh
Nitin Gadkari
Regional Ring Road
Vijayawada National Highway
Bander Port

More Telugu News