Nara Lokesh: జగన్ ప్రెస్‌మీట్‌పై లోకేశ్ స్పందన ఇలా..

Nara Lokesh Responds to Jagans Press Meet
  • జగన్మోహనరెడ్డికి పీపీపీకి, ప్రైవేటీకరణకు మధ్య తేడా తెలియదన్న మంత్రి నారా లోకేశ్
  • వైద్య కళాశాలలకు వైసీపీ ప్రభుత్వం పునాదులైనా వేయలేదన్న మంత్రి లోకేశ్
  • వైద్య కళాశాలల అభివృద్ధికి పీపీపీ విధానాన్ని అమలు చేస్తున్నామన్న లోకేశ్
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై చేసిన విమర్శలపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. జగన్మోహన్ రెడ్డికి పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం), ప్రైవేటీకరణ మధ్య వ్యత్యాసం కూడా తెలియదని ఎద్దేవా చేశారు. నిన్న సచివాలయంలో ఆయన మీడియాతో ముచ్చటించారు.

వైద్య కళాశాలల అభివృద్ధి కోసం తాము ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వైద్య కళాశాలలకు వైసీపీ ప్రభుత్వం పునాదులైనా వేయలేదని, అన్నీ కట్టేశామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం ఒక్కటైనా నిజం మాట్లాడాలని సూచించారు. కొంతమందికి అవగాహన లేకపోతే, పీపీపీ గురించి పక్కనున్న సలహాదారులను అడిగి తెలుసుకోవాలని లోకేష్ అన్నారు.

అంతలా మాట్లాడే వైసీపీ నాయకులు ఐదేళ్ల పాలనలో వైద్య కళాశాలలను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. "మా ప్రభుత్వ లక్ష్యం అన్నింటినీ పూర్తి చేయడం, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడం" అని ఆయన అన్నారు.

పులివెందుల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి బెంగళూరు నుంచి మాట్లాడారా, విజయవాడ నుంచా అని లోకేష్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించగా, వారు విజయవాడ నుంచి అని సమాధానమిచ్చారు. ఓహో, బెంగళూరు నుంచి మాట్లాడారనుకున్నా అంటూ ఆయన వ్యంగ్యంగా అన్నారు. 
Nara Lokesh
YS Jagan
Andhra Pradesh
TDP
YSRCP
PPP model
Medical colleges
Privatization
Andhra Pradesh Politics
Political criticism

More Telugu News