Raja Singh: రాజీనామా ప్రసక్తే లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి: రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Raja Singh No Resignation What You Want Do
  • ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేది లేదని స్పష్టం చేసిన రాజాసింగ్
  • ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఎమ్మెల్యే వ్యాఖ్య
  • బీజేపీలో కొందరు నేతలు పదవుల కోసం చూస్తూ మాట్లాడటం లేదన్న రాజాసింగ్
  • పార్టీ తప్పు చేస్తే మాత్రం తాను ఎదురుతిరుగుతానని వెల్లడి
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయబోనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరేమి చేసుకుంటారో చేసుకోండంటూ తీవ్రంగా స్పందించారు. తన రాజకీయ వైఖరిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తనను వరుసగా మూడుసార్లు గోషామహల్ నియోజకవర్గ ప్రజలే గెలిపించారని అన్నారు. రాష్ట్రస్థాయి బీజేపీ తనకు ఏ విధమైన మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా ఇచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. తాను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పు ఉందా అంటే బీజేపీ కార్యకర్తలను అడిగి తెలుసుకోవచ్చునని అన్నారు.

కొంతమంది పార్టీ పెద్దలకు భయపడి ఏమీ అనలేకపోతుండవచ్చునని రాజాసింగ్ అన్నారు. వారికి పదవి భయం ఉండవచ్చునని, కానీ తనకు ఎలాంటి పదవి ఆశ లేదని స్పష్టం చేశారు. తాను చేసే ప్రతి వ్యాఖ్య కార్యకర్తలకు మద్దతుగా ఉంటుందని అన్నారు.

తన వైఖరి భిన్నంగా ఉంటుందని రాజాసింగ్ స్పష్టం చేశారు. పార్టీ పెద్దలు ఎప్పుడు తప్పు చేసినా, తాను కచ్చితంగా ఎదురు తిరిగి ప్రశ్నిస్తానని ఆయన వెల్లడించారు. పార్టీ ప్రయోజనాల కంటే ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమని, అందుకోసం ఎవరితోనైనా పోరాడతానని ఆయన పేర్కొన్నారు.

తనకు ఢిల్లీ పెద్దలు తరుచూ ఫోన్ చేసి మాట్లాడుతారని, తనకు అధిష్ఠానం పెద్దల ఆశీర్వాదం ఉందని ఆయన అన్నారు. వాళ్లను కలిసి పార్టీలో జరిగిందంతా చెబుతానని వ్యాఖ్యానించారు. తాను ఎప్పటికీ బీజేపీ నేతనేనని, కానీ సెక్యులర్ వాదిని మాత్రం కానని స్పష్టం చేశారు. తాను బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో చేరేది లేదని తేల్చి చెప్పారు.

పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినందుకు యోగి ఆదిత్యనాథ్ తనకు ఫోన్ చేసి తిట్టారని అన్నారు. తాను చేసే కామెంట్స్ పార్టీపై కాదని, కొందరు నేతలపై మాత్రమే అన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందవద్దని, ఢిల్లీ పెద్దలు పిలిస్తే వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. కిషన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే తాను కూడా చేస్తానని చెప్పారు.
Raja Singh
Raja Singh Goshamahal
Goshamahal MLA
Telangana BJP
BJP Telangana
Raja Singh controversy

More Telugu News