Chandrababu Naidu: అనంతపురం సభ... జగన్ పై చంద్రబాబు సెటైర్లు... కూటమి ఐక్యంగా ఉంటుందన్న పవన్

Chandrababu Naidu Slams Jagan at Anantapur Meeting
  • అనంతపురంలో సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ
  • 15 నెలల్లోనే హామీలు నెరవేర్చామన్న చంద్రబాబు
  • మెడికల్ కాలేజీలంటే తెలియని నాయకుడు అంటూ జగన్ పై సెటైర్లు
  • ప్రజా శ్రేయస్సు కోసం ఐక్యంగా పని చేస్తామన్న పవన్
  • రాయలసీమ రతనాలసీమగా మారతోందన్న పరిటాల సునీత
తాము నిర్వహించింది రాజకీయ సభ కాదని, 15 నెలల పాలనలో ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పడానికే ఈ విజయోత్సవ సభ నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన 'సూపర్ సిక్స్-సూపర్ హిట్' బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీలను విజయవంతంగా అమలు చేశామని తెలిపారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల జీవితాలను మార్చే ప్రభుత్వమని, సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని, అదొక బాధ్యత అని అన్నారు.

గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని, పెట్టుబడులను తరిమేసిందని చంద్రబాబు విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక, పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను మార్చేందుకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశామని తెలిపారు. "నాడు పెన్షన్ల పెంపు అసాధ్యమన్నారు, తల్లికి వందనం పథకాన్ని ట్రోల్ చేశారు, ఉచిత బస్సు ప్రయాణం అసాధ్యమని హేళన చేశారు. కానీ, కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ సుసాధ్యం చేసి చూపించింది" అని ఆయన గుర్తుచేశారు.

కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం, అన్ని వర్గాల ప్రభుత్వం, అందరి జీవితాలు మార్చే ప్రభుత్వం అని ముఖ్యమంత్రి అన్నారు. "ప్రధాని మోదీ దసరాకు కానుక ఇస్తున్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చారు. ధరలను తగ్గిస్తున్నారు. పన్నులను తగ్గించడం వంటి మంచి నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీని అభినందించాలి. యూనివర్సల్ హెల్త్ స్కీం తెచ్చాం. దీంతో పేదల వైద్య ఖర్చులు తగ్గుతాయి" అని చెప్పారు.

"మెడికల్ కాలేజీలంటే తెలియని నాయకుడు... నేనేదో పొడిచేశానని మాట్లాడుతున్నాడు" అంటూ జగన్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. భూమి ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీ అయిపోదని... రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని అన్నారు. ఫౌండేషన్ వేసి, రిబ్బన్ కట్  చేసి, ఏదో చేశానని చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రండి... మెడికల్ కాలేజీలపై చర్చిద్దామని సవాల్ విసిరారు.

ఇదే సమయంలో, నేపాల్‌లో ఆందోళనల కారణంగా చిక్కుకుపోయిన 200 మంది తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే బాధ్యతను మంత్రి నారా లోకేశ్ కు అప్పగించినట్లు సీఎం వెల్లడించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు.

కూటమి ఐక్యంగా పనిచేస్తుంది: పవన్ కల్యాణ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పార్టీలు వేరైనా ప్రజా శ్రేయస్సు కోసం కూటమి ఐక్యంగా పనిచేస్తుందని అన్నారు. రాయలసీమలో కరవును పారదోలి అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తున్నామని, గ్రామీణ ప్రాంతాల్లో 4 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పథకాలు రాష్ట్ర సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం వల్లే రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,500 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని గుర్తుచేశారు. రాయలసీమకు 200 టీఎంసీల నీటి హామీని త్వరలోనే అమలు చేస్తామని ఆయన ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతన్నలకు భరోసా లభించిందని, ‘అన్నదాత సుఖీభవ’ కింద తొలి విడత సాయం అందించామని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకాలతో మహిళలకు అండగా నిలిచారని, చంద్రబాబు నాయకత్వంలో రాయలసీమ 'రతనాల సీమ'గా మారుతోందని ఆమె అన్నారు.
Chandrababu Naidu
Andhra Pradesh
Super Six Schemes
Pawan Kalyan
TDP
Jagan Mohan Reddy
Rayalaseema
AP Elections 2024
Narendra Modi
Healthcare

More Telugu News