KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం సర్వే చేయిస్తున్నాం.. అంతా బాగుంది కానీ!:కేటీఆర్

KTR Jubilee Hills byelection survey positive but needs work in bastis
  • కొన్ని బస్తీల్లో వెనుకంజలో ఉన్నామని, కలిసికట్టుగా పని చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు
  • అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఉపఎన్నిక ఉంటుందన్న కేటీఆర్
  • మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయన్న కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సర్వే చేయిస్తున్నామని, ఈ నియోజకవర్గంలో పరిస్థితి బాగుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొన్ని బస్తీల్లో వెనుకంజలో ఉన్నామని, అందరూ కలిసికట్టుగా పని చేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఉప ఎన్నిక ఉంటుందని చెప్పారు.

మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో పార్టీని గెలిపించడమే గోపీనాథ్‌కు సరైన నివాళి అని పేర్కొన్నారు. ఓటుకు రూ. 5 వేలు పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సోదరుడు చెరువులో ఇళ్లు కట్టినా హైడ్రా వెళ్లడం లేదని, కానీ పేదల బస్తీలకు వెళ్లి కూలగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు ఉంటే తొలగించాలని కేటీఆర్ అన్నారు. ఓటరు జాబితాలో పేరు లేకుంటే చేర్చాలని సూచించారు. పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ మూసీ ప్రాజెక్టుకు డబ్బులు ఉన్నాయా అని విమర్శించారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సత్తా చాటాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రి లేరని కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని ఆకాంక్షించారు.

మాగంటి సునీత మాట్లాడుతూ, గోపినాథ్‌లాగే తనకూ కార్యకర్తలు అండగా నిలవాలని కోరారు. గోపినాథ్ ఆశయాలను నెరవేర్చేందుకు అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు. పార్టీలో కష్టపడే కార్యకర్తలకు గుర్తింపు ఉందని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఆయన అన్నారు.
KTR
Jubilee Hills byelection
BRS party
Maganti Sunitha
Telangana politics
Vishnuvardhan Reddy

More Telugu News