Yvette Cooper: యూకే కొరడా.. 20,000 మంది భారతీయుల భవితవ్యం ప్రశ్నార్థకం!

UK Visa Policy Change Impacts Thousands of Indians
  • బ్రిటన్‌లో భారతీయులకు బ్రేక్
  • వీసాలపై ఉక్కుపాదం మోపనున్న కొత్త ప్రభుత్వం!
  • 'వెనక్కి పిలవండి.. లేదంటే వీసాలు బంద్' అంటూ హెచ్చరిక 
  • ‘రిటర్న్స్’ ఒప్పందంపై యూకే సీరియస్
  • భారత్ సహా మూడు దేశాలకు గట్టి హెచ్చరిక
 బ్రిటన్‌లో నివసిస్తున్న వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. వీసా గడువు ముగిసినా తమ దేశాలకు తిరిగి వెళ్లని వారిని వెనక్కి తీసుకునే విషయంలో సహకరించని దేశాలపై ఉక్కుపాదం మోపాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్థాన్, నైజీరియాలు ఉండటంతో, ఆయా దేశాల పౌరులకు వీసాలు జారీ చేయడంలో కఠిన ఆంక్షలు విధించనున్నట్లు బ్రిటన్ కాబోయే హోం సెక్రటరీ (లేబర్ పార్టీ షాడో హోం సెక్రటరీ) యెవెట్ కూపర్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

అక్రమ వలసదారులను నియంత్రించడంలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం 'రిటర్న్స్' ఒప్పందాలను (తిరిగి పంపించే ఒప్పందాలు) కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ ఒప్పందాల ప్రకారం వీసా గడువు ముగిసిన లేదా చట్టవిరుద్ధంగా దేశంలోకి ప్రవేశించిన తమ పౌరులను ఆయా దేశాలు తిరిగి వెనక్కి తీసుకోవాలి. అయితే, ఈ ప్రక్రియలో కొన్ని దేశాలు సహకరించడం లేదని బ్రిటన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వీసా విధానాన్ని ఒక 'బేరసారాల అస్త్రంగా' వాడుకోవాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోంది.

ఒకవేళ భారత్ వంటి దేశాలు తమ పౌరులను వెనక్కి తీసుకోవడంలో జాప్యం చేస్తే తొలుత వీసా దరఖాస్తు రుసుములను భారీగా పెంచాలని, వీసా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయాలని, చివరి అస్త్రంగా ఆ దేశ పౌరులకు తాత్కాలికంగా లేదా పూర్తిగా వీసాలను నిలిపివేయాలని యోచిస్తోంది.

భారతీయులే అధికం
బ్రిటన్ హోం ఆఫీస్ గణాంకాల ప్రకారం వీసా గడువు ముగిసినా దేశంలోనే ఉండిపోయిన వారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 2020 నాటికే దాదాపు 20,706 మంది భారతీయులు ఈ జాబితాలో ఉన్నట్లు అంచనా. గత ఏడాది భారత్ సుమారు 7,400 మందిని వెనక్కి తీసుకున్నప్పటికీ, పాస్‌పోర్టులు లేని వారిని గుర్తించి, వారికి అత్యవసర ప్రయాణ పత్రాలు జారీ చేయడంలో భారత ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని యూకే అధికారులు ఆరోపిస్తున్నారు.

బెడిసికొట్టనున్న సంబంధాలు
బ్రిటన్ ఏకపక్షంగా తీసుకునే ఈ నిర్ణయం భారత్ వంటి కీలక భాగస్వామ్య దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన మైగ్రేషన్ అబ్జర్వేటరీ నిపుణుడు డాక్టర్ పీటర్ వాల్ష్ మాట్లాడుతూ "యూకే వీసా వ్యవస్థను అత్యధికంగా వినియోగించుకుంటున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇటువంటి బెదిరింపు ధోరణిని భారత్ తేలిగ్గా తీసుకోదు. ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్య, విద్యా సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది" అని అభిప్రాయపడ్డారు.

కాగా, ఈ సమస్యను పరిష్కరించడానికి ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని, అవసరమైతే ఏ దేశానికైనా వీసాలను ఆయుధంగా ప్రయోగించడానికి సిద్ధమని యెవెట్ కూపర్ స్పష్టం చేశారు. దీంతో బ్రిటన్‌లో చదువు, ఉద్యోగాల కోసం వెళ్లాలనుకుంటున్న లక్షలాది మంది భారతీయుల్లో ఆందోళన నెలకొంది.
Yvette Cooper
UK visa policy
Indian immigrants
UK immigration
Visa overstay
Illegal immigration
Returns agreement
India UK relations
UK home office
British visa

More Telugu News