Andhra Pradesh Government: పీపీపీ విధానంలో ఏపీలో పది కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి ప్రభుత్వ ఆమోదం

Andhra Pradesh Govt Approves 10 New Medical Colleges Under PPP Model
  • ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ 
  • తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలు
  • కేపీఎంజీ అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేసిన అధ్యయన నివేదికలను పరిశీలించిన ప్రత్యేక కమిటీ 
  • ప్రత్యేక కమిటీ సిఫారసులను ఆమోదించిన ప్రభుత్వం
రాష్ట్రంలో వైద్య విద్యను అభివృద్ధి చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. మొత్తం 10 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, నిర్వహణను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో చేపట్టేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఈ మేరకు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలి దశలో ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలకు టెండర్లు పిలిచి అభివృద్ధి పనులు ప్రారంభించాలని స్పష్టంగా పేర్కొంది. మిగిలిన పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కళాశాలల విషయంలోనూ త్వరలో చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పీపీపీ విధానాన్ని అనుసరించడం ద్వారా నిధుల సమీకరణ వేగంగా జరిగి, ప్రాజెక్టులు సమయానికి పూర్తవుతాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.

ఈ నాలుగు కళాశాలల అభివృద్ధికి సంబంధించి కేపీఎంజీ అడ్వయిజరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేసిన అధ్యయన నివేదికలను పరిశీలించిన ప్రత్యేక కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. తక్షణమే నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య సేవలు – మౌలిక సదుపాయాల సంస్థకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల వైద్య విద్యావకాశాలు విస్తరించడమే కాకుండా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల వ్యాప్తి మరింత మెరుగుపడడానికి దోహదపడుతుంది. 
Andhra Pradesh Government
AP medical colleges
PPP model
public private partnership
medical education AP
Adoni
Markapuram
Madanapalle
Pulivendula
health services Andhra Pradesh

More Telugu News