Jhala Nath Khanal: నేపాల్‌లో హింసాకాండ: మాజీ ప్రధాని భార్యను సజీవంగా తగలబెట్టిన నిరసనకారులు

Former Nepal PMs Wife Burned Alive in Protest Violence
  • నిరసనకారులు ఇల్లు తగలబెట్టడంతో మాజీ ప్రధాని భార్య మృతి
  • రాజ్యలక్ష్మిని బయటకు రానివ్వకుండా అడ్డుకొని ఇంటికి నిప్పు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన మాజీ ప్రధాని భార్య
నేపాల్‌లో పరిస్థితులు అదుపు తప్పాయి. ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల మధ్య, మంగళవారం జరిగిన ఒక దారుణ ఘటనలో నేపాల్ మాజీ ప్రధానమంత్రి ఝాలానాథ్ ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకార్ సజీవ దహనమయ్యారు.

రాజధాని ఖాట్మండులోని డల్లు ప్రాంతంలో ఉన్న ఝాలానాథ్ ఖనాల్ నివాసాన్ని ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఇంట్లో ఉన్న రాజ్యలక్ష్మిని బయటకు రానివ్వకుండా అడ్డుకుని ఇంటికి నిప్పు పెట్టారు. తీవ్రంగా గాయపడిన ఆమెను కీర్తిపూర్ బర్న్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

మరోవైపు, దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనల సెగ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వాన్ని తాకింది. ఆందోళనకారులు ఆయన ఇంటికి కూడా నిప్పు పెట్టడంతో తీవ్రమైన ఒత్తిడి నడుమ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో మొదలైన ఈ నిరసనలు ప్రభుత్వ వ్యతిరేకతగా, అవినీతి ఆరోపణలుగా మారి దేశాన్ని అల్లకల్లోలం చేశాయి.
Jhala Nath Khanal
Nepal
Rajya Lakshmi Chitrakar
Nepal protests
Social media ban Nepal
KP Sharma Oli

More Telugu News