KP Oli: అట్టుడుకుతున్న నేపాల్... దుబాయ్ కి పారిపోయే యోచనలో ప్రధాని కేపీ ఓలీ!

Nepal PM Oli plans Dubai exit amid escalating protests
  • హింసాత్మకంగా మారిన నేపాల్ ఆందోళనలు
  • రాజకీయా సంక్షోభం దిశగా నేపాల్
  • ఇప్పటికే పలువురు మంత్రులు రాజీనామా
హిమాలయ దేశం నేపాల్‌లో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో దేశం అట్టుడుకుతోంది. నిరసనకారులు ఏకంగా ప్రధాని, అధ్యక్షుడి నివాసాలకే నిప్పు పెట్టడంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఈ తీవ్ర పరిణామాల నేపథ్యంలో ప్రధాని కేపీ శర్మ ఓలీ దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమైనట్లు వార్తలు రావడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

ఈరోజు కూడా యువత పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. రాజధాని ఖాట్మండు సహా పలు నగరాల్లో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. ప్రధాని కేపీ శర్మ ఓలీ, అధ్యక్షుడు రామ్‌చంద్ర పౌడెల్‌ల ప్రైవేటు నివాసాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. భక్తపూర్‌లోని ప్రధాని అధికారిక నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు. మాజీ ఉప ప్రధాని రఘువీర్‌ మహాసేత్‌ ఇంటిపై రాళ్ల దాడి జరగ్గా, సోమవారం రాజీనామా చేసిన హోంమంత్రి రమేశ్‌ లేఖక్‌ నివాసాన్ని ఆందోళనకారులు తగలబెట్టారు.

ఈ హింసాత్మక ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు ఒక్కొక్కరిగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. హోంమంత్రి రమేశ్‌ లేఖక్‌ బాటలోనే వ్యవసాయ శాఖ మంత్రి రామ్‌నాథ్‌ అధికారి, నీటి సరఫరా శాఖ మంత్రి ప్రదీప్‌ యాదవ్‌ కూడా తమ రాజీనామాలను ప్రకటించారు. పలువురు ఎంపీలు కూడా రాజీనామాలు సమర్పించడంతో ఓలీ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.

ఈ రాజకీయ సంక్షోభం నడుమ, ప్రధాని ఓలీ దుబాయ్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. వైద్య చికిత్స కోసమే ఆయన వెళుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం హిమాలయ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఉప ప్రధానికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది.

మరోవైపు, ఆందోళనల్లో మరణించిన యువతకు న్యాయం జరిగే వరకు, ఓలీ ప్రభుత్వం గద్దె దిగేవరకు తమ పోరాటం ఆగదని నిరసనకారులు స్పష్టం చేస్తున్నారు. 
KP Oli
Nepal protests
Nepal crisis
Ram Chandra Paudel
Kathmandu
Nepal Prime Minister
Nepal President
Dubai
Political unrest Nepal
Nepal government

More Telugu News