Visakha Crime: విశాఖలో దారుణం.. మాట్లాడలేని బాలికపై బాలుర అఘాయిత్యం

Visakhapatnam Minor Girl Assaulted by Two Boys
  • సీతమ్మధారలో 11 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం
  • గ్రహణం మొర్రి కారణంగా సరిగా మాట్లాడలేని స్థితిలో బాధితురాలు
  • 16 ఏళ్ల ఇద్దరు బాలుర పైశాచికం
  • ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు సమీపంలోని తుప్పల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యం
  • పోక్సో, బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు  
  • కేసు దర్యాప్తు దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ
నగరంలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రహణం మొర్రి శస్త్రచికిత్స కారణంగా మాటలు సరిగా రాని 11 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు బాలురు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికను లక్ష్యంగా చేసుకుని ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. విశాఖ ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.

ద్వారకా పోలీసుల కథనం ప్రకారం.. సీతమ్మధార కొండ ప్రాంతంలోని బిలాల్ కాలనీలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. వారి 11 ఏళ్ల కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. గ్రహణం మొర్రి ఉండటంతో ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. దీంతో ఆ బాలిక సరిగా మాట్లాడలేని స్థితిలో ఉంది. వీరి ఇంటికి సమీపంలోనే 16 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు నివసిస్తున్నారు. వారిలో ఒకరు ఐటీఐ రెండో సంవత్సరం చదువుతుండగా, మరొకరు ఎనిమిదో తరగతితోనే చదువు మానేశారు.

ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బాలిక తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లారు. ఇంట్లో చిన్నారి ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితులు, ఆమెకు మాయమాటలు చెప్పి సమీపంలోని తుప్పల్లోకి తీసుకెళ్లారు. బాలిక ఎంత ఏడుస్తున్నా కనికరించకుండా ఇద్దరూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి అక్కడి నుంచి పరారయ్యారు.

పని ముగించుకుని ఇంటికి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల వెతుకుతుండగా, కొండవాలున ఉన్న తుప్పల్లోంచి బాలిక ఏడుపు వినిపించింది. అక్కడికి వెళ్లి చూడగా, రక్తస్రావంతో బాధపడుతున్న కుమార్తెను చూసి హతాశులయ్యారు. వెంటనే వారు డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న ద్వారకా పోలీసులు, బాలిక పరిస్థితిని గమనించి ప్రాథమిక విచారణ చేపట్టారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారించుకుని నిందితులపై పోక్సో చట్టంతో పాటు బీఎన్ఎస్ కింద పలు సెక్షన్ల మేరకు కేసు నమోదు చేశారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు దిశ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. నిందితులైన ఇద్దరు మైనర్లను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
Visakha Crime
Visakhapatnam
Minor Girl Rape
Dwaraka Police Station
POCSO Act
Bilal Colony
Andhra Pradesh Crime
Sexual Assault
Disha Police Station

More Telugu News