H1B visa: అమెరికాలో ఆ పని చేస్తున్నారా?.. దేశం విడిచి వెళ్లాల్సిందే!

H1B F1 Visa Holders May Face Deportation for Illegal Work
  • అమెరికాలో హెచ్ 1బీ, ఎఫ్‌1 వీసాదారులపై ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
  • నిబంధనలకు విరుద్ధంగా పార్ట్-టైమ్ ఉద్యోగాలపై కఠిన చర్యలకు సన్నద్ధం
  • వీసాదారుల పన్ను రికార్డులు, ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ
  • సోషల్ మీడియా ఖాతాలపై కూడా నిఘా పెట్టిన ఇమిగ్రేషన్ అధికారులు
  • నిబంధనలు ఉల్లంఘించిన వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రమాదం
అమెరికాలో నివసిస్తున్న హెచ్ 1బీ, ఎఫ్‌1 (విద్యార్థి) వీసాదారులకు ఇది కీలకమైన హెచ్చరిక. నిబంధనలకు విరుద్ధంగా పార్ట్-టైమ్ ఉద్యోగాలు లేదా ఇతర మార్గాల ద్వారా అదనపు ఆదాయం సంపాదిస్తున్న వారిపై డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. చిన్న పొరపాటు చేసినా దేశ బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని ఇమిగ్రేషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా ప్రభుత్వం, ఇప్పుడు చట్టబద్ధంగా దేశంలో ఉంటున్న వీసాదారుల కార్యకలాపాలపై కూడా దృష్టి సారించింది. ముఖ్యంగా ఇమిగ్రేషన్ అధికారులు రాయబార కార్యాలయాలు, ఎయిర్‌పోర్టులలోని ఎంట్రీ పాయింట్ల వద్ద వీసాదారులను క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు. గతంలో విద్యార్థిగా ఉన్నప్పుడు అనధికారికంగా ఏమైనా పనులు చేశారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనల నుంచి వారి పూర్తి నేపథ్యం వరకు అన్ని వివరాలను పరిశీలిస్తున్నారు.

ఈ నిఘాలో భాగంగా అమెరికా పన్నుల విభాగమైన ఐఆర్‌ఎస్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. వీసాదారుల ఆదాయ వివరాలు, పన్ను చెల్లింపుల్లో ఏవైనా తేడాలు ఉన్నాయా? అని ఆరా తీస్తున్నారు. ఈ ఆర్థిక సమాచారాన్ని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) విభాగానికి అందిస్తున్నారు. అంతేకాకుండా, వీసాదారుల సోషల్ మీడియా ఖాతాలపై కూడా ఓ కన్నేసి వారి ప్రవర్తనను అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ కఠిన నిబంధనలు ఇంకా పూర్తిస్థాయిలో అమలు కానప్పటికీ, వీసాదారులు చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అనధికారిక పనులు, అదనపు ఆదాయ మార్గాలకు దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఏవైనా సందేహాలు ఉంటే, వెంటనే న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే దేశ బహిష్కరణ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని వారు వివరిస్తున్నారు.
H1B visa
H1B visa USA
F1 visa
USA immigration
Donald Trump
US immigration policy
Immigration and Customs Enforcement
IRS records
US visa holders
America

More Telugu News