US Visa: అమెరికా వీసాపై కొత్త రూల్.. భారతీయులకు ఇక ఆ వెసులుబాటు కట్

US Visa Rule Change Impacts Indians Interview Flexibility Cut
  • అమెరికా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా నిబంధనల్లో కీలక మార్పు
  • సొంత దేశంలోనే వీసా ఇంటర్వ్యూకు హాజరుకావాలన్న నిబంధన
  • మూడో దేశంలో అపాయింట్‌మెంట్ పొందే వెసులుబాటు రద్దు
  • కరోనా సమయంలో ఇచ్చిన మినహాయింపునకు తెర
  • భారతీయ పర్యాటకులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు ఇది ముఖ్య గమనిక. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల జారీ ప్రక్రియలో అమెరికా ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు తమ సొంత దేశంలో లేదా చట్టబద్ధంగా నివసిస్తున్న దేశంలో మాత్రమే ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇతర దేశాలకు వెళ్లి వేగంగా వీసా ఇంటర్వ్యూ పూర్తి చేసుకునే వెసులుబాటును అమెరికా విదేశాంగ శాఖ (DoS) రద్దు చేసింది. ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వచ్చింది.

కరోనా మహమ్మారి సమయంలో భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయాల్లో వీసా దరఖాస్తులు భారీగా పేరుకుపోయాయి. దీంతో అపాయింట్‌మెంట్ కోసం దాదాపు మూడేళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ జాప్యాన్ని నివారించేందుకు చాలామంది భారతీయులు దుబాయ్, బ్యాంకాక్ వంటి ఇతర దేశాలకు వెళ్లి వేగంగా బీ1 (వ్యాపారం), బీ2 (పర్యాటకం) వీసా ఇంటర్వ్యూలను పూర్తి చేసుకున్నారు. కరోనా సంక్షోభం దృష్ట్యా అమెరికా ప్రభుత్వం కూడా ఈ వెసులుబాటును కల్పించింది. అయితే, తాజాగా ఆ మినహాయింపును తొలగిస్తున్నట్లు ప్రకటించింది.

ఈ మార్పు వల్ల పర్యాటకం, వ్యాపారం, విద్య (ఎఫ్-1), తాత్కాలిక ఉద్యోగ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. ముఖ్యంగా అత్యవసరంగా వ్యాపార సమావేశాలు లేదా కుటుంబ కార్యక్రమాల కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు తప్పవు. "ది వీసా కోడ్" వ్యవస్థాపకుడు జ్ఞానమూకన్ సెంతుర్‌జోతి మాట్లాడుతూ.. ఇప్పటికే యూరప్, ఆసియా, మధ్యప్రాచ్య దేశాల్లో వీసా ఇంటర్వ్యూల కోసం దరఖాస్తు చేసుకున్న అనేక మంది ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు.

తాజా మార్పులతో అమెరికా ప్రయాణాలకు చాలా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం తప్పనిసరిగా మారింది. తమ సొంత దేశంలో వీసా ప్రక్రియకు పట్టే సుదీర్ఘ సమయాన్ని కూడా దరఖాస్తుదారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రయాణికులు తమ ప్రణాళికలను మార్చుకోవడం లేదా సులభమైన వీసా నిబంధనలున్న ఇతర దేశాలను ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
US Visa
America Visa
Indian Visa
US Embassy
Visa Interview
B1 Visa
B2 Visa
Visa Appointment
Travel Ban
Gyanamookan Senthurjothi

More Telugu News