Shashi Tharoor: భారత్ ఎవరికీ సారీ చెప్పదు.. ఎంపీ శశిథరూర్

Shashi Tharoor Says India Will Not Apologize to Anyone
  • క్షమాపణ చెప్పేంత తప్పేమీ భారత్ చేయలేదన్న కాంగ్రెస్ ఎంపీ
  • రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గతంలో అమెరికానే ప్రోత్సహించిందన్న థరూర్
  • మాకంటే ఎక్కువగా రష్యా చమురును చైనా దిగుమతి చేసుకుంటోందని ఆరోపణ
  • అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన శశిథరూర్
భారత దేశం ఎవరికీ ఎలాంటి క్షమాపణ చెప్పదని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పష్టం చేశారు. అసలు క్షమాపణ కోరేంత తప్పు భారత్ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈమేరకు అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుత్నిక్ చేసిన వ్యాఖ్యలపై థరూర్ తాజాగా స్పందించారు. రష్యా నుంచి మన దేశం చమురు దిగుమతి చేసుకుంటుండంపై అమెరికా ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. తాను హెచ్చరించినా చమురు కొనుగోళ్లు ఆపలేదనే కోపంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై భారీగా టారిఫ్ లు విధించారు.

దీంతో ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. ప్రతిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ లతో భేటీ అయ్యారు. ఈ పరిణామాలపై హోవార్డ్ లుత్నిక్ స్పందిస్తూ.. ‘మరో రెండు నెలల్లో భారత్ మా దారికి వస్తుంది, భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు సారీ చెబుతారు’ అంటూ వ్యాఖ్యానించారు.
 
హోవార్డ్ లుత్నిక్ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తాజాగా తిప్పికొట్టారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలంటూ మొదట్లో భారత్ ను ప్రోత్సహించిందే అమెరికా అని గుర్తుచేశారు. అంతర్జాతీయంగా ధరల స్థిరీకరణ కోసం రష్యా చమురు కొనాలని చెప్పిందన్నారు. ఇప్పుడు అదే అమెరికా రష్యా చమురు కొనొద్దని చెబుతోందని చెప్పారు. ‘మీరు కొనమంటే కొనాలి, వద్దంటే మానేయాలా?’ అని నిలదీశారు.

ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే భారత విదేశాంగ విధానం ఉంటుందని థరూర్ స్పష్టం చేశారు. చైనా, తుర్కియే దేశాలు రష్యా నుంచి భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్నాయని, రష్యా నుంచి పెద్ద మొత్తంలో వివిధ ఉత్పత్తులను యూరప్ దిగుమతి చేసుకుంటోందని థరూర్ వివరించారు. భారత్ తో పోలిస్తే ఈ దేశాల వల్లే రష్యాకు పెద్ద మొత్తంలో డాలర్ నిల్వలు సమకూరుతున్నాయని ఆరోపించారు. వాటిని వదిలేసి భారత్ ను లక్ష్యంగా చేసుకుని టారిఫ్ లు విధించి అమెరికానే తప్పు చేసిందని విమర్శించారు.

ఈ సందర్భంగా లుత్నిక్ ను ఉద్దేశిస్తూ.. ‘మీ దేశం విషయంలో మీకెంత సార్వభౌమాధికారం ఉంటుందో, మీ నిర్ణయాల విషయంలో మీరెంత స్వతంత్రంగా ఉంటారో మా దేశం విషయంలో మేం కూడా అంతే సార్వభౌమాధికారంతో, స్వతంత్రతతో వ్యవహరిస్తాం’ అనే విషయం అర్థం చేసుకోవాలని శశిథరూర్ హితవు పలికారు.
Shashi Tharoor
India
United States
Russia
oil imports
Howard Lutnick
Narendra Modi
foreign policy
tariffs
international relations

More Telugu News