Turakapalem melioidosis: తురకపాలెంలో మరో మెలియాయిడోసిస్ కేసు నిర్ధారణ

Turakapalem Melioidosis Case Confirmed Again in Guntur District
  • గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆరుగురు
  • 46 ఏళ్ల వ్యక్తికి మెలియాయిడోసిస్ పాజిటివ్ నిర్ధారణ
  • నేడు సమీక్ష నిర్వహించనున్న సీఎం చంద్రబాబు
  • రేపు గ్రామానికి ఐసీఎంఆర్ బృందం
గుంటూరు జిల్లా తురకపాలేంలో మెలియాయిడోసిస్‌ వ్యాధి కలకలం రేపుతోంది. గుంటూరు జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్న ఆరుగురిలో ఒకరికి ఈ అరుదైన బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు జిల్లా కలెక్టర్ ఎస్‌. నాగలక్ష్మి తెలిపారు.
 
46 ఏళ్ల బాధితుని మోకాలిలోని ద్రవ నమూనాను పరీక్షించగా, మెలియాయిడోసిస్ వ్యాధి అని నిర్ధారణ అయింది.   ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, మరింత వైద్యపరీక్షల కోసం ఎడమ మోకాలికి ఎంఆర్‌ఐ స్కానింగ్ చేసినట్లు తెలిపారు. ఇదివరకే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగికి కూడా మెలియాయిడోసిస్ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా స్థిరంగానే ఉందని అధికారులు వెల్లడించారు.
 
గ్రామస్థుల నుంచి పెద్దఎత్తున నమూనాలు

తురకపాలెం గ్రామంలో ఈ నెల 2 నుంచి 7వ తేదీ వరకు, అనుమానిత లక్షణాలతో ఉన్న 72 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా, వారిలో నలుగురికి బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లు తేలింది. మరో 14 మందికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని తేలగా, మిగిలిన నమూనాల ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.
 
అత్యంత అప్రమత్తంగా అధికారులు

గ్రామంలో ప్రస్తుతం వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య చర్యలు జోరుగా కొనసాగుతున్నాయి. మొత్తం 68 నీటి ట్యాంకులు శుభ్రపరచడంతో పాటు, ఇంటింటికీ ఆహారం, సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఎన్‌సీడీ సర్వేలో భాగంగా 41 అంశాలపై హెల్త్ ప్రొఫైల్స్ రూపొందిస్తున్నారు. ఆదివారం నాటికి 1,364 మంది గ్రామస్తుల రక్త నమూనాలు సేకరించి, పరీక్షలకు పంపించారు. 
 
రేపు గ్రామానికి ఐసీఎంఆర్ నిపుణుల బృందం 

కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో ఐసీఎంఆర్ నిపుణుల బృందం రేపు గ్రామాన్ని సందర్శించనుంది. మంగళగిరి ఎయిమ్స్‌, గుంటూరు మెడికల్ కాలేజీ, జీజీహెచ్‌ అధికారులు కలిసి కోర్ టీం ఏర్పాటు చేశారు. ఈ బృందం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహించనుంది.
 
నేడు సీఎం చంద్రబాబు సమీక్ష

తురకపాలెం గ్రామ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గ్రామస్థుల ఆరోగ్య సమాచారం ఆధారంగా హెల్త్ ప్రొఫైల్స్‌ను సిద్ధం చేసే పనులు వేగంగా సాగుతున్నాయి. 
Turakapalem melioidosis
Melioidosis Turakapalem
Guntur district
S Nagalakshmi
Bacterial infection
ICMR
Chandrababu Naidu
Andhra Pradesh health

More Telugu News