Warangal: వరంగల్‌లో థ్రిల్లర్ సీన్.. భారీ వర్షంతో వరదలో చిక్కుకున్న బస్సులు.. ప్రయాణికుల ఆర్తనాదాలు!

Warangal Floods RTC Bus Stuck Under Bridge Passengers Panic
  • వరంగల్‌లో కుండపోత వర్షం.. జలమయమైన రైల్వే అండర్ బ్రిడ్జి
  • వరద నీటిలో చిక్కుకుపోయిన రెండు ఆర్టీసీ బస్సులు
  • బస్సుల్లో సుమారు 100 మంది ప్రయాణికులు
  • ప్రాణభయంతో ప్రయాణికుల హాహాకారాలు
  • తాడు సాయంతో అందరినీ కాపాడిన పోలీసులు
  • అండర్ బ్రిడ్జి మార్గం మూసివేత, ట్రాఫిక్ మళ్లింపు
వరంగల్‌లో ఈ ఉదయం కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. నగరంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కిందకు భారీగా వరద నీరు చేరడంతో ఆ మార్గంలో వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు పూర్తిగా చిక్కుకుపోయాయి. బస్సుల్లో ఉన్న సుమారు వంద మంది ప్రయాణికులు ప్రాణభయంతో ఆర్తనాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అన్నారం, మహబూబాబాద్ ప్రాంతాల నుంచి వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రయాణికులతో వరంగల్ చేరుకున్నాయి. అయితే, ఉదయం కురిసిన కుండపోత వానకు రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా జలమయమైంది. లోతును అంచనా వేయలేక ముందుకు వెళ్లిన బస్సులు వరద నీటిలో చిక్కుకోవడంతో ఇంజిన్లు ఆగిపోయి మధ్యలోనే నిలిచిపోయాయి. నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో బస్సుల్లోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు.

పరిస్థితిని గమనించిన స్థానికులు తక్షణమే మిల్స్ కాలనీ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో ఒక పెద్ద తాడును బస్సుల వద్దకు చేరవేసి, దాని సాయంతో ప్రయాణికులను ఒక్కొక్కరిగా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు వంద మందిని కాపాడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన అనంతరం పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా ఆ మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. వాహన రాకపోకలను మరో దారికి మళ్లించారు. పోలీసుల సత్వర స్పందనతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు, స్థానికులు తెలిపారు.
Warangal
Warangal floods
Telangana rains
RTC bus
flooding
heavy rain
rescue operation
Mills Colony
Mahabubabad
Anneram

More Telugu News