Vijayawada Utsav: అంబరాన్ని తాకేలా బెజవాడలో దసరా సంబరాలు .. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వరకు విజయవాడ ఉత్సవ్

Vijayawada Utsav Celebrations to Touch the Sky
  • దసరా సందర్భంగా  ఈ నెల 22 నుంచి వేడుకలు
  • సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడోత్సవాలు
  • మైసూరు దసరా తరహాలో విజయవాడలో ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను నిర్వహిస్తామన్న ఎంపీ కేశినేని చిన్ని
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా "విజయవాడ ఉత్సవ్" నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. పర్యాటక రంగానికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో వినోదభరిత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, క్రీడా పోటీలను నిర్వహించనున్నారు.

ఉత్సవ నిర్వహణ బాధ్యతను శ్రేయాస్ మీడియా సంస్థ చేపట్టగా, కృష్ణానది తీరం, తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ మైదానం, గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానాల్లో వేడుకలు జరగనున్నాయి.

వేడుకల ప్రధానాంశాలు:

* కృష్ణానదిలో పడవల పోటీలు, జలక్రీడలు
* డ్రోన్ షోలు, బాణసంచా ప్రదర్శనలు (ప్రకాశం బ్యారేజీపై ప్రతిరోజూ)
* కిడ్స్ జోన్స్, అమ్యూజ్‌మెంట్ పార్క్, షాపింగ్ స్టాళ్లు
* పున్నమిఘాట్ వద్ద ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్లు, జానపద కళాకారుల ప్రదర్శనలు
* తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుర్రకథలు, నాటకాలు, నృత్య ప్రదర్శనలు, ప్రవచనాలు

ప్రతిరోజూ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్:

* గొల్లపూడిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతిరోజూ ఒక సినీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
* సెప్టెంబర్ 22న ఓజీతో ప్రారంభం, ఆ తర్వాత అఖండ-2, మన శంకరవరప్రసాద్ చిత్రాలకు పాటల విడుదల, సంగీత కచేరీలు
* ప్రతి రోజు ప్రముఖ సినీ తారల హాజరుతో వేడుకలు

ప్రత్యేక కార్యక్రమాలు:

* మిస్ విజయవాడ పోటీ
* విజయవాడ ఐడల్ – యువ గాయకుల కోసం
* 2కే, 5కే, 20కే మారథాన్ రన్‌లు
* హెలికాప్టర్ రైడ్స్, హాట్ ఎయిర్ బెలూన్ ప్రయాణాలు
* అగ్ని అవార్డులు – సినీ, సోషల్ మీడియా రంగాల్లో పురస్కారాలు

ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మాట్లాడుతూ "మైసూరు దసరా తరహాలో విజయవాడలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము" అని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ దుర్గమ్మను దర్శించేందుకు వచ్చే భక్తులు కనీసం రెండు రోజులు విజయవాడలో ఉండి, ఈ ఉత్సవాలను ఆస్వాదించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 
Vijayawada Utsav
Dasara festival
Andhra Pradesh tourism
Krishna River
Keshineni Srinivas
G Lakshmisha
OG movie event
Vijayawada events
Cultural festivals
Drone show

More Telugu News