BCCI: ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు.. బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే షాక్!

BCCI adds Rs 14627 crore in five years Bank Balance Exceeds Rs 20686 Crores
  • 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 20,686 కోట్లు
  • గత ఆర్థిక సంవత్సరంలోనే రూ. 4,193 కోట్లు పెరిగిన బోర్డు సంపద
  • గడిచిన ఐదేళ్లలో ఏకంగా రూ. 14,627 కోట్లు పెరిగిన నగదు నిల్వలు
  • టీమిండియా మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రం భారీ తగ్గుదల
  • ఆదాయపు పన్ను కోసం రూ. 3,150 కోట్లు కేటాయించిన బీసీసీఐ
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ తన ఖజానాను మరింత నింపుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బీసీసీఐ ఆర్థిక నివేదికలో ఆశ్చర్యపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర క్రికెట్ సంఘాలకు పంపిణీ చేసిన నివేదిక ప్రకారం, ఈ ఏడాది మార్చి ముగిసేనాటికి బీసీసీఐ బ్యాంక్ ఖాతాల్లో ఏకంగా రూ. 20,686 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.

గత ఐదేళ్ల కాలంలో బీసీసీఐ సంపద అనూహ్యంగా పెరిగింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర సంఘాలకు నిధులు పంపిణీ చేయకముందు బోర్డు వద్ద రూ. 6,059 కోట్లు ఉండగా, ఇప్పుడు అన్ని పంపిణీలు పూర్తయ్యాక కూడా రూ. 20 వేల కోట్లకు పైగా బ్యాలెన్స్ ఉండటం విశేషం. కేవలం గత ఆర్థిక సంవత్సరంలోనే బీసీసీఐ ఆస్తికి రూ. 4,193 కోట్లు అదనంగా చేరాయి. ఐదేళ్లలో మొత్తం రూ. 14,627 కోట్ల వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో బీసీసీఐ జనరల్ ఫండ్ కూడా 2019లో రూ. 3,906 కోట్ల నుంచి 2024 నాటికి రూ. 7,988 కోట్లకు పెరిగింది.

బోర్డు సంపద ఈ స్థాయిలో పెరుగుతున్నప్పటికీ, టీమిండియా మ్యాచ్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో మాత్రం భారీ తగ్గుదల కనిపించడం గమనార్హం. 2022-23లో మ్యాచ్‌ల మీడియా హక్కుల ద్వారా రూ. 2,524.80 కోట్లు ఆర్జించిన బీసీసీఐ, 2023-24లో కేవలం రూ. 813.14 కోట్లు మాత్రమే సంపాదించింది. స్వదేశంలో తక్కువ మ్యాచ్‌లు జరగడం, 2023 ప్రపంచ కప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వడం వల్లే ఈ తగ్గుదల నమోదైందని బోర్డు వివరించింది. భారత పురుషుల జట్టు పర్యటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా రూ. 642.78 కోట్ల నుంచి రూ. 361.22 కోట్లకు పడిపోయింది.

మరోవైపు, బీసీసీఐ ఆదాయపు పన్ను చెల్లింపుల కోసం రూ. 3,150 కోట్లను కేటాయించింది. అలాగే, దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1,200 కోట్లు, మాజీ ఆటగాళ్ల సంక్షేమం కోసం ప్లాటినం జూబ్లీ ఫండ్‌కు రూ. 350 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు మరో రూ. 500 కోట్లు కేటాయించినట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ నెల 28న ముంబైలో జరగనున్న బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
BCCI
Indian Cricket Board
Richest Cricket Board
BCCI Financial Report
BCCI Bank Balance
Indian Cricket
Cricket in India
BCCI Revenue
BCCI AGM
Cricket Finances

More Telugu News