Gold price: నెల రోజుల్లోనే రూ. 6,000కు పైగా పెరిగిన బంగారం ధర, రూ. 10,000 పెరిగిన వెండి

Gold Price Soars Rs 6000 Silver Up Rs 10000 in a Month
  • కేవలం 30 రోజుల్లోనే భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
  • చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరిన పసిడి, వెండి
  • అంతర్జాతీయ రాజకీయ అనిశ్చితులే కారణమని వెల్లడి
దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దూసుకుపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే ధరలు కొనుగోలుదారులకు అందుబాటులో లేకుండా ఆకాశాన్నంటాయి. అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పసిడి, వెండి ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. గత 30 రోజుల్లోనే 10 గ్రాముల బంగారంపై రూ.6,000లకు పైగా, కేజీ వెండిపై రూ.10,000లకు పైగా ధర పెరగడం మార్కెట్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం, ఆగస్టు 5న రూ.1,00,076గా ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర, శుక్రవారం నాటికి రూ.6,262 పెరిగి రూ.1,06,338 వద్ద స్థిరపడింది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో అక్టోబర్ 3న గడువు ముగిసే గోల్డ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా రూ.1,07,740 వద్ద ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది. ఒక్క ఈ వారంలోనే తులం బంగారంపై రూ.1,845 పెరగడం గమనార్హం.

బంగారంతో పాటు వెండి కూడా పోటీ పడుతోంది. సెప్టెంబర్ 4న కేజీ వెండి ధర చరిత్రాత్మక గరిష్ఠ స్థాయి అయిన రూ.1,23,207ను తాకింది. శుక్రవారం స్వల్పంగా తగ్గి రూ.1,23,170 వద్ద ముగిసింది. ఆగస్టు 5న రూ.1,12,422గా ఉన్న కిలో వెండి ధర, నెల రోజుల్లోనే రూ.10,748 మేర పెరిగింది. ఈ వారంలో కూడా వెండి ధర స్థిరంగా పెరుగుతూ వచ్చింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాలపై విధిస్తున్న సుంకాలు, ఉక్రెయిన్, గాజా స్ట్రిప్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు వంటి అంతర్జాతీయ పరిణామాలు బంగారం, వెండి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి తోడు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం కూడా ధరల పెరుగుదలకు మరింత ఊతమిస్తోంది.
Gold price
Gold rate today
Silver price
Silver rate today
Indian Bullion and Jewellers Association

More Telugu News