Narendra Modi: మోదీ, మాక్రాన్‌ల మధ్య ఫోన్ చర్చ: ఉక్రెయిన్ వివాదంపై కీలక సంప్రదింపులు

Narendra Modi and Macron Discuss Ukraine Conflict
  • ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ మధ్య ఫోన్ సంభాషణ
  • ఉక్రెయిన్ యుద్ధానికి త్వరగా ముగింపు పలకడంపై ఇరు నేతల చర్చ
  • శాంతియుత పరిష్కారానికే భారత్ మద్దతు అని మరోసారి స్పష్టం చేసిన మోదీ
  • రక్షణ, వాణిజ్యం సహా ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై సమీక్ష
  • 2026 ఏఐ సమ్మిట్‌కు రావాలని మోదీ ఆహ్వానం.. అంగీకరించిన మాక్రాన్
  • గత నెలలోనూ ఇరు నేతల మధ్య కీలక అంశాలపై చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ టెలిఫోన్ ద్వారా సంభాషించారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదానికి త్వరితగతిన ముగింపు పలికేందుకు జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాలపై ఇరువురు నేతలు కీలక చర్చలు జరిపారు. ఈ వివాదానికి శాంతియుత పరిష్కారం కనుగొనడానికే భారత్ స్థిరంగా కట్టుబడి ఉందని మోదీ ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, స్థిరత్వం నెలకొనాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఉక్రెయిన్ అంశంతో పాటు, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకార పురోగతిని కూడా నేతలు సమీక్షించుకున్నారు. ఆర్థిక, రక్షణ, శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాల్లో సహకారం మరింత బలపడటంపై సంతృప్తి వ్యక్తం చేశారు. 'హారిజాన్ 2047', 'ఇండో-పసిఫిక్ రోడ్‌మ్యాప్', 'రక్షణ పారిశ్రామిక రోడ్‌మ్యాప్' వంటి కీలక ఒప్పందాలకు అనుగుణంగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు.

ఈ సంభాషణ ఎంతో ఫలప్రదంగా సాగిందని ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా తెలిపారు. "అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నాం. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తూనే ఉంటుంది" అని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో, 2026 ఫిబ్రవరిలో భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'కు రావాలన్న తన ఆహ్వానాన్ని మాక్రాన్ స్వీకరించినందుకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటన విడుదల చేసింది.
Narendra Modi
Emmanuel Macron
Ukraine conflict
India France relations
Bilateral cooperation

More Telugu News