Asia Cup: ఆసియా కప్‌లో భారత్ ఆధిపత్యం.. టోర్నీలో చెక్కుచెదరని రికార్డులివే!

Asia Cup India Dominance Unbroken Records
  • ఈ నెల 9న దుబాయ్‌లో ప్రారంభంకానున్న ఆసియా కప్
  • అత్యధికంగా 8 సార్లు టైటిల్ గెలిచి అగ్రస్థానంలో భారత్
  • వరుసగా మూడుసార్లు టైటిల్ నెగ్గిన ఏకైక జట్టుగా టీమిండియా
  • పరుగుల పరంగా టోర్నీ చరిత్రలోనే అతిపెద్ద విజయం భారత్‌దే
  • 2023 ఫైనల్‌లో అత్యంత వేగంగా లక్ష్యాన్ని ఛేదించిన రికార్డు
  • టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ
ఆసియా కప్ టోర్నమెంట్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుండగా, ఈ మెగా ఈవెంట్‌లో టీమిండియా నెలకొల్పిన కొన్ని రికార్డులు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. టోర్నీ చరిత్రను పరిశీలిస్తే, భారత్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఈ టీ20 సమరం మొదలుకానుంది.

ఇప్పటివరకు 16 ఎడిషన్లు పూర్తి చేసుకున్న ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. ఏకంగా 8 సార్లు ఛాంపియన్‌గా అవతరించింది. భారత్ తర్వాత శ్రీలంక 6 టైటిళ్లతో రెండో స్థానంలో ఉంది. అంతేకాకుండా, 1988, 1991, 1995 సంవత్సరాల్లో వరుసగా మూడుసార్లు కప్ గెలిచి 'హ్యాట్రిక్ ఛాంపియన్'గా నిలిచిన ఏకైక జట్టు కూడా టీమిండియానే.

విజయాల పరంగా కూడా భారత్ పేరిట అరుదైన ఘనతలున్నాయి. 2008లో హాంకాంగ్‌పై 256 పరుగుల భారీ తేడాతో గెలిచిన భారత్, టోర్నీ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. అలాగే, 2023 ఫైనల్‌లో శ్రీలంకను కేవలం 50 పరుగులకే ఆలౌట్ చేసి, ఆ లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఇది ఫైనల్స్‌లో అత్యంత వేగవంతమైన విజయం.

జట్టు పరంగానే కాకుండా, వ్యక్తిగత రికార్డుల్లోనూ భారత ఆటగాళ్లు ముందున్నారు. ప్రస్తుత టీమిండియా వ‌న్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఆసియా కప్‌లో ఇప్పటివరకు మొత్తం 40 సిక్సర్లు బాది, ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇలాంటి అద్భుతమైన రికార్డులతో, డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ 17వ ఎడిషన్‌లో బరిలోకి దిగుతోంది.


Asia Cup
Team India
Rohit Sharma
Indian Cricket Team
Sri Lanka
Cricket Records
Asia Cup Records
T20
Dubai
Cricket

More Telugu News