Kavitha: బీఆర్ఎస్‌లో ‘హంపి’ చిచ్చు.. కేటీఆర్‌కు వ్యతిరేకంగా కుట్ర జరిగిందా?

Kavitha Hampi Controversy Sparks in BRS Party
  • కవిత వర్గం నుంచి సోషల్ మీడియాలో వరుస లీకులు
  • ‘కవితక్క అప్‌డేట్స్‌’ ఖాతాలో మరో సంచలన ఆరోపణ
  • కేటీఆర్‌ను సీఎం చేయొద్దంటూ హంపిలో రహస్య సమావేశం జరిగినట్టు పోస్ట్
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడం, ఆ తర్వాత ఆమె పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బీఆర్ఎస్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొత్త మలుపులు తిరుగుతోంది. కవిత మద్దతుదారులుగా భావిస్తున్న ‘కవితక్క అప్‌డేట్స్‌’ అనే ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా నుంచి వస్తున్న వరుస పోస్టులు పార్టీలో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఆ ఖాతా నుంచి చేసిన ఓ పోస్ట్ బీఆర్ఎస్‌లో పెను దుమారం రేపుతోంది.

బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే కేటీఆర్‌కు వ్యతిరేకంగా కొందరు సీనియర్ నేతలు కుట్ర పన్నారని ఈ పోస్టులో సంచలన ఆరోపణలు చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత పార్టీ ఇస్తున్నారనే నెపంతో కొందరు ఎమ్మెల్యేలను హంపికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. అక్కడ వారు పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆ పోస్టులో వెల్లడించారు.

"కేసీఆర్ తర్వాత ఆయన కొడుకు కాబట్టి కేటీఆర్‌ను సీఎం చేస్తే మేం ఒప్పుకోం. ఈ పార్టీకి ఓనర్లం మేమే" అంటూ ఆ సమావేశంలో నేతలు వ్యాఖ్యానించినట్లు ఆరోపించారు. అంతటితో ఆగకుండా, పార్టీకి, కేసీఆర్‌కు వ్యతిరేకంగా వారు పాటలు కూడా పాడారని ఆ పోస్టులో పేర్కొనడం గమనార్హం. నేరుగా ఎవరి పేర్లనూ ప్రస్తావించకుండా ‘హంపిలో కమలాన్ని మొలకెత్తించాలని అనుకున్న కారు ఓనర్లు’ అనే క్యాప్షన్ తో ఈ ఆరోపణలు చేశారు.

ఇటీవల కవిత తన రాజీనామా సందర్భంగా ఎమ్మెల్యేల హంపీ టూర్ గురించి ప్రస్తావిస్తూ హరీశ్‌రావుపై పరోక్షంగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అంశంపై మరిన్ని వివరాలు బయటకు రావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వరుస లీకుల వెనుక ఎవరున్నారు, ఈ ఆరోపణల్లో నిజానిజాలెంత అనే దానిపై బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. 
Kavitha
Kalvakuntla Kavitha
BRS party
KTR
Telangana politics
Hampi tour
Harish Rao
internal conflict
MLA poaching
TRS

More Telugu News