iPhone 17: యాపిల్ అభిమానులకు పండగే.. అదిరిపోయే ఫీచర్లతో ఐఫోన్ 17 సిరీస్.. లాంచ్‌కు డేట్ ఫిక్స్

iPhone 17 Series Launch Date Fixed with Amazing Features
  • ఈ నెల‌ 9న యాపిల్ ‘ఆ డ్రాపింగ్’ పేరుతో ప్రత్యేక ఈవెంట్
  • ఐఫోన్ 17 సిరీస్‌లో కొత్తగా ‘ఎయిర్’ మోడల్ 
  • ఐదేళ్ల తర్వాత ఐఫోన్ డిజైన్‌లో భారీ మార్పులకు అవకాశం
  • అత్యంత సన్నని ఫోన్‌గా ఐఫోన్ 17 ఎయిర్ ఉండొచ్చని అంచనా
  • ప్రో మ్యాక్స్ మోడల్‌లో ఇప్పటివరకూ లేనంత పెద్ద బ్యాటరీ
  • భారత్‌లో రూ. 89,900 నుంచి ధరలు మొదలయ్యే అవకాశం
టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ‘ఆ డ్రాపింగ్’ (Awe dropping) పేరుతో వచ్చే మంగళవారం (సెప్టెంబర్ 9న) నిర్వహించనున్న ప్రత్యేక ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్‌ను అధికారికంగా లాంచ్ చేయనుంది. ఈసారి ఐఫోన్ డిజైన్‌లో గత ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ మార్పులు ఉండబోతున్నాయని, ‘ప్లస్’ మోడల్ స్థానంలో సరికొత్తగా ‘ఐఫోన్ 17 ఎయిర్’ను పరిచయం చేయనున్నారని మార్కెట్ వర్గాల్లో అంచనాలు వెలువడుతున్నాయి.

వివిధ నివేదికలు మరియు లీకుల ప్రకారం, కొత్తగా రాబోయే ఐఫోన్ 17 ఎయిర్ కేవలం 5.5 మిల్లీమీటర్ల మందంతో అత్యంత సన్నని ఐఫోన్‌గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్, ఐప్యాడ్ ఎయిర్ స్ఫూర్తితో దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో 6.6 అంగుళాల స్క్రీన్, ప్రోమోషన్ సపోర్ట్, ఏ19 ప్రాసెసర్ వంటి ఫీచర్లు ఉంటాయని సమాచారం. బేసిక్ ఐఫోన్ 17తో పాటు ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడళ్లు కూడా విడుదల కానున్నాయి.

ఇక, ఇతర మోడళ్ల విషయానికొస్తే, ఐఫోన్ 17 ప్రో కెమెరా విభాగంలో గణనీయమైన మెరుగుదలలు ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా తక్కువ వెలుతురులో మెరుగైన ఫోటోగ్రఫీ, జూమ్ సామర్థ్యాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ మోడల్‌లో సుమారు 5,000mAh సామర్థ్యంతో ఇప్పటివరకూ ఐఫోన్లలో కెల్లా అతిపెద్ద బ్యాటరీని అమర్చనున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రస్తుత ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (4,676mAh) కంటే ఎక్కువ.

ఈ కొత్త సిరీస్ ఆకుపచ్చ, పర్పుల్ వంటి తాజా రంగులలో అందుబాటులోకి రావచ్చని లీకులు సూచిస్తున్నాయి. ఇక ధరల విషయానికొస్తే, భారత్‌లో ఐఫోన్ 17 బేస్ మోడల్ ధర సుమారు రూ. 89,900 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 17 ఎయిర్ ధర రూ. 95,000 వరకు, అత్యంత ఖరీదైన ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ. 1,64,900 వరకు ఉండొచ్చని భావిస్తున్నారు. ఐఫోన్లతో పాటు ఈ ఈవెంట్‌లో కొత్త యాపిల్ వాచ్, అప్‌డేటెడ్ ఎయిర్‌పాడ్స్‌ను కూడా యాపిల్ విడుదల చేయనుంది.
iPhone 17
Apple
iPhone 17 Air
iPhone 17 Pro
iPhone 17 Pro Max
Apple Event
A19 Processor
Smartphone
Technology
Apple Watch

More Telugu News