YS Jagan: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వైసీపీ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ

YS Jagan AP Assembly Session Schedule Announced YSRCP Attendance in Doubt
  • ఈ నెల 18న ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసనమండలి ప్రారంభం
  • ఉత్తర్వులు జారీ చేసిన అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్
  • ఏడు నుంచి పది పనిదినాలపాటు సమావేశాలు  
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. 16వ శాసనసభకు సంబంధించిన నాల్గవ సెషన్ ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అనుమతి ఇచ్చిన ఉత్తర్వులను అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్నకుమార్ నిన్న విడుదల చేశారు.

అదే రోజున ఉదయం 10 గంటలకు శాసన మండలి 48వ సెషన్ కూడా ప్రారంభం కానుంది. ఈ సమావేశాలు ఏడు నుంచి పది పనిదినాలపాటు సాగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొదటి రోజున అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు కొనసాగించాలి, ఏయే అంశాలపై చర్చ జరగాలి అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటారు.

ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు ఆర్డినెన్స్‌ల స్థానంలో వాటికి సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. అలాగే ప్రభుత్వం మరికొన్ని కొత్త బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టే అవకాశం ఉందని సమాచారం.

మరోవైపు ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటి వరకు జరిగిన శాసనసభ సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ, ఈ సారి హాజరవుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఈ సమావేశాలకు హాజరుకాకపోతే వైసీపీపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే వైఎస్ జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరవుతారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. 
YS Jagan
AP Assembly sessions
Andhra Pradesh Assembly
YSRCP attendance
AP Assembly meeting 2024
Assembly session schedule
YCP MLA disqualification
AP politics
YS Jagan opposition leader
Surya Devara Prasanna Kumar

More Telugu News