Patient: కిడ్నీ చికిత్సకు వెళితే హెచ్‌ఐవీ సోకింది.. డయాలసిస్ కేంద్రం వద్ద బాధితుడి ఆందోళన

Patient Contracts HIV During Kidney Treatment Dialysis Center Protest
  • మణుగూరు డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగికి హెచ్‌ఐవీ
  • ఏడు నెలల పాటు డయాలసిస్ చేయించుకున్న తర్వాత పాజిటివ్‌గా నిర్ధారణ
  • కేంద్రం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ బాధితుడి ఆరోపణ
  • ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధుడి ఆందోళన
కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న ఓ వృద్ధుడికి హెచ్‌ఐవీ సోకింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. డయాలసిస్ కేంద్రం సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తనకు ఈ వ్యాధి సోకిందని ఆరోపిస్తూ బాధితుడు నిన్న మణుగూరులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగాడు.

అశ్వాపురం మండలానికి చెందిన 60 ఏళ్ల గిరిజన వృద్ధుడు మూత్రపిండాల సమస్యతో ఈ ఏడాది జనవరిలో మణుగూరులోని డయాలసిస్ కేంద్రంలో చేరాడు. చికిత్స ప్రారంభించే ముందు నిర్వహించిన పరీక్షల్లో ఆయన రక్తహీనతతో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో జనవరి 15న భద్రాచలం బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తాన్ని తెప్పించి ఆయనకు ఎక్కించారు. అప్పటి నుంచి ఆగస్టు 15 వరకు దాదాపు ఏడు నెలల పాటు వారానికి మూడుసార్లు డయాలసిస్ సేవలు అందించారు.

ఆగస్టు 15న నిర్వహించిన రక్త పరీక్షల్లో అతడికి హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. నిర్ధారణ కోసం ఓ ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయించగా అక్కడ కూడా అదే ఫలితం వచ్చింది. దీంతో మణుగూరు కేంద్రంలో ఆయనకు డయాలసిస్ సేవలను నిలిపివేసి, భద్రాచలంలోని హెచ్‌ఐవీ కేంద్రంలో మందులు అందిస్తున్నారు.  బాధితుడు ప్రస్తుతం హెచ్‌ఐవీ రోగుల కోసం ప్రత్యేకంగా సేవలు అందించే హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి వెళ్లి డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోంది.

ఈ ఘటనపై డయాలసిస్ కేంద్రం నిర్వాహకుడు సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ఆ రోగి తమ కేంద్రానికి రాకముందు హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లోని పలు ఆసుపత్రులలో చికిత్స పొందారని, ఆ సమయంలో ఎక్కడైనా పొరపాటు జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబం డిమాండ్ చేస్తోంది.
Patient
HIV infection
dialysis center
Kidney disease
Manuguru
Bhadrachalam
Telangana
Gandhi Hospital
blood transfusion
negligence

More Telugu News