Howard Lutnick: ఒకట్రెండు నెలల్లో భారత్ సారీ చెబుతుంది: అమెరికా వాణిజ్య మంత్రి సంచలన వ్యాఖ్యలు

India Will Say Sorry to US In 2 Months says Howard Lutnick
  • ఒకట్రెండు నెలల్లో చర్చలకు వచ్చి భారత్ క్షమాపణ చెబుతుందన్న అమెరికా వాణిజ్య మంత్రి 
  • రష్యా నుంచి చమురు కొనడం ఆపకపోతే 50 శాతం టారిఫ్‌లు తప్పవని వార్నింగ్
  • రష్యా చమురు కొనుగోలు కొనసాగిస్తామని స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి నిర్మల
భారత్, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ వైఖరిపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన జాతీయ ప్రయోజనాలకే కట్టుబడిన భారత్, రానున్న ఒకట్రెండు నెలల్లో దిగివచ్చి తమతో వాణిజ్య ఒప్పందం కోసం క్షమాపణ చెబుతుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లూట్నిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో లూట్నిక్ మాట్లాడుతూ.. "ఇంకో నెల, రెండు నెలల్లో భారత్ చర్చల కోసం మా వద్దకు వస్తుంది. అప్పుడు వారు క్షమాపణ చెప్పి డొనాల్డ్ ట్రంప్‌తో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు" అని జోస్యం చెప్పారు. అమెరికాకు మద్దతు ఇవ్వని పక్షంలో, భారత్ నుంచి వచ్చే ఎగుమతులపై 50 శాతం టారిఫ్‌లు చెల్లించాల్సి వస్తుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. "ఇదంతా కేవలం ధైర్యం ప్రదర్శించడమే. అతిపెద్ద క్లయింట్‌తో గొడవపడటం బాగుంటుంది. కానీ చివరికి వ్యాపార వర్గాలు అమెరికాతో ఒప్పందం కోరుకుంటాయి" అని ఆయన వ్యాఖ్యానించారు.

అమెరికా హెచ్చరికలపై భారత ప్రభుత్వం దీటుగా స్పందించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిస్సందేహంగా కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. "ధర, రవాణా సౌకర్యం వంటి అంశాల్లో ఏది మాకు ఉత్తమంగా సరిపోతుందో దాని ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాం. మాకు ఏది లాభదాయకమో చూసుకుని రష్యా చమురును తప్పకుండా కొంటాం" అని ఆమె స్పష్టం చేశారు.

అలాగే ట్రంప్ సీనియర్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆయన వ్యాఖ్యలు అవాస్తవమని, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. తమ జాతీయ ప్రయోజనాలను, ఆర్థిక భద్రతను కాపాడుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. 
Howard Lutnick
India US trade
India Russia oil
US trade policy
Nirmala Sitharaman
Indian economy
Russia Ukraine war
US tariffs
India foreign policy
trade relations

More Telugu News