US Population Decline: అమెరికాలో డేంజర్ బెల్స్.. భారీగా పడిపోతున్న జనాభా.. కారణాలివే!

US Faces Historic Population Decline Due to Low Birth Rates Immigration
  • 250 ఏళ్ల అమెరికా చరిత్రలో తొలిసారి తగ్గనున్న జనాభా
  • 2025లో జనాభా క్షీణత తప్పదని నిపుణుల అంచనా
  • భారీగా పడిపోయిన వలసలు, జననాల రేటు ప్రధాన కారణం
  • అంతర్యుద్ధం, కరోనా సమయంలో కూడా ఆగని జనాభా పెరుగుదల
  • ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక దేశం వీడిన 20 లక్షల మంది వలసదారులు
అమెరికా చరిత్రలోనే ఒక అపూర్వమైన, కీలకమైన పరిణామం చోటుచేసుకోనుంది. సుమారు 250 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అగ్రరాజ్యం జనాభా తొలిసారిగా తగ్గుముఖం పట్టనుంది. వలసలు భారీగా పడిపోవడం, జననాల రేటు క్షీణించడమే ఇందుకు ప్రధాన కారణాలని అమెరికన్‌ ఎంటర్‌ప్రైజ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏఈఐ) తన నివేదికలో వెల్లడించింది.

ఏఈఐ అంచనాల ప్రకారం, 2025 సంవత్సరంలో దేశ జనాభాలో తగ్గుదల నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది అమెరికాకు వచ్చే వలసదారుల సంఖ్య 5,25,000 కన్నా తక్కువగా ఉండొచ్చని సంస్థ పేర్కొంది. దీనికి తోడు, గత ఏడాది దేశవ్యాప్తంగా కేవలం 5,19,000 జననాలు మాత్రమే నమోదయ్యాయి. ఈ రెండు లెక్కలను బట్టి చూస్తే, ఈ ఏడాది సుమారు 6,000 మంది జనాభా తగ్గనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అమెరికా చరిత్రలో ఇంతటి తీవ్రమైన పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయిన భయంకరమైన అంతర్యుద్ధం (సివిల్ వార్) సమయంలో గానీ, ఇటీవలే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్-19 మహమ్మారి విజృంభణలో గానీ దేశ జనాభా పెరుగుతూనే వచ్చింది తప్ప ఎన్నడూ తగ్గలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఈ జనాభా క్షీణత ఇక్కడితో ఆగేలా కనిపించడం లేదు. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫ్యామిలీ స్టడీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) నిర్వహించిన సర్వే ప్రకారం, రాబోయే 30 ఏళ్ల పాటు అమెరికాలో జననాల రేటు 1.6 వద్దే స్థిరంగా కొనసాగనుంది. ఒక దేశ జనాభా స్థిరంగా ఉండాలంటే ప్రతి మహిళకు జననాల రేటు 2.1గా ఉండాలి. కానీ, ప్రస్తుత రేటు దానికంటే చాలా తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

ఇదిలా ఉండగా, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత దేశం విడిచి వెళ్లిన వలసదారుల సంఖ్య కూడా ఈ పరిస్థితికి ఒక కారణంగా నిలుస్తోంది. ట్రంప్ హయాంలో సుమారు 20 లక్షల మంది వలసదారులు అమెరికాను విడిచి వెళ్లినట్లు నివేదికలు చెబుతున్నాయి. మొత్తం మీద, తగ్గుతున్న జననాలు, వలసలతో అగ్రరాజ్యం ఒక చారిత్రక జనాభా మార్పును ఎదుర్కొంటోంది.
US Population Decline
Donald Trump
US population decrease
American Enterprise Institute
AEI report
US birth rate
US immigration
declining population
population crisis
US demographics

More Telugu News