Nara Lokesh: ఇది నిజంగా జరిగిన కథ: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh shares inspiring Abdul Kalam story
  • విజయవాడలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు
  • పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్
  • ఓ స్ఫూర్తిదాయక గాథ చెప్పిన లోకేశ్
విజయవాడలోని ఏ-కన్వెన్షన్ సెంటర్‌లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి లోకేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 175 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన అంశాన్ని అందరితో పంచుకున్నారు. 

"ఒక చిన్న కథ చెబుతాను. ఇది నిజంగా జరిగిన కథ. పందొమ్మిదేళ్ళ యువకుడు 50 ఏళ్ల వ్యక్తికి డ్రైవరుగా వచ్చాడు. కారులో వెళుతుండగా ఏం చదివావు అని అడిగాడు పెద్దాయన. టెన్త్ క్లాస్ ఫెయిలయ్యాను... ఇంగ్లీషు సబ్జెక్టు పోయింది అని చెప్పాడు డ్రైవర్. నేను నీకు హెల్ప్ చేస్తాను... నువ్వు పాసవ్వాలి అని చెప్పి... ఆఫీసు అయ్యాక ఆ డ్రైవరుకి ఇంగ్లీషు పాఠాలు చెప్పాడు ఆ పెద్దాయన. ఆ విధంగా డ్రైవర్ టెన్త్ పాసపయ్యాడు. టెన్త్ పాసైన డ్రైవరుకి ఇంటర్ ఫీజు కట్టి పుస్తకాలిచ్చాడు ఆ పెద్దాయన. ఆఫీసు అయ్యాక డ్రైవరు ఇంటర్ పుస్తకాలు, పెద్దాయన లైబ్రరీ పుస్తకాలు పోటాపోటీగా చదివేవారు. ఇంటర్ అయ్యింది... ఈసారి బీఏ టార్గెట్. అదీ కంప్లీట్ అయింది. పీజీ చెయ్ అన్నాడాయన. డ్రైవరు ఆలోచించాడు. తనను చదివిస్తున్న వ్యక్తి గ్రాడ్యుయేట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే అతన్ని దాటిపోతానేమో అని భయపడ్డాడు. పెద్దాయన డ్రైవరుకి విమానం టిక్కెట్టు కొని మరీ పరీక్షలకు పంపాడు. గొప్ప గురువులెప్పుడూ తమ శిష్యులు తమకంటే పైకి ఎదగాలని కోరుకుంటారు. టెన్త్ పోయిన ఆ అబ్బాయి పీహెచ్ డీ పూర్తి చేశాడు... మరి ఆ గొప్ప గురువు ఎవరో కాదు... మన మిస్సైల్ మేన్ అబ్దుల్ కలాం గారు. ఆ డ్రైవర్ పేరు కదిరేశన్. చదువు ఒక వ్యక్తిని పేదరికం నుంచి బయటకు తీసుకువస్తుంది అనేందుకు ఇదో ఉదాహరణ. విద్యా బోధన పవిత్రమైన వృత్తి అన్న అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో పనిచేస్తున్న గురువులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను" అంటూ నారా లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Chandrababu Naidu
AP Teachers Day
Abdul Kalam
Kadhiresan
Education importance
Telugu news
Vijayawada
Best teachers awards
Andhra Pradesh education

More Telugu News