Gorantla Butchaiah Choudary: వైసీపీ కార్యాలయం ముందు టు-లెట్ బోర్డు ఖాయం: గోరంట్ల

Gorantla Butchaiah Choudary Says YCP Office Will Have ToLet Board Soon
  • కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అన్న గోరంట్ల
  • గత ప్రభుత్వంలో సజ్జల ఒక రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని విమర్శలు
  • 11 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి ప్రతిపక్ష హోదా అడగడం విడ్డూరమని వ్యాఖ్యలు
  • జగన్‌కు ధైర్యం ఉంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'సూపర్ సిక్స్' పథకాలు సూపర్ హిట్ అయ్యాయని, త్వరలోనే వైసీపీ 'టు-లెట్' బోర్డు పెట్టడం ఖాయమని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' పథకాలతో దూసుకెళుతోందని బుచ్చయ్య చౌదరి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎన్నికల హామీలలో ఇప్పటికే 70 శాతానికి పైగా నెరవేర్చామని చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలోని రైతులు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇకపై తప్పుడు ఆరోపణలు, గ్లోబెల్స్ ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని, వాటిని కఠినంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు.

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్ అసెంబ్లీకి వస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ప్రతిపక్ష హోదా ఎలా కట్టబెడతారని ఆయన ప్రశ్నించారు.

గత ప్రభుత్వంలో సజ్జల ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రభుత్వ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని గోరంట్ల తీవ్ర ఆరోపణలు చేశారు. కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవని సజ్జల, ఏ హోదాలో మాట్లాడుతున్నారని నిలదీశారు. తన కుమారుడితో కలిసి 'సైకో ఫ్యాక్టరీ' నడుపుతూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని, మద్యం, ఇసుక, మైనింగ్ మాఫియాలలో ఆయన పాత్రపై త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు.

ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు వైఎస్ జగన్‌కు ధైర్యం లేదని, అందుకే అసెంబ్లీకి రావడం లేదని గోరంట్ల విమర్శించారు. "మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, ప్రజా సమస్యలపై చర్చిద్దాం. మీకు ఎన్ని గంటలైనా మైక్ ఇస్తాం" అని సవాల్ విసిరారు. బయట సాక్షి మీడియాలో ప్రచారం చేయడం కాదని, ప్రజావేదిక అయిన అసెంబ్లీలో మాట్లాడాలని హితవు పలికారు.


Gorantla Butchaiah Choudary
YCP
TDP
Andhra Pradesh
Super Six Schemes
Sajjala Ramakrishna Reddy
Chandrababu Naidu
AP Assembly
Politics
Telugu Desam Party

More Telugu News