Sangeeta: సమోసా తేలేదని భార్య వాగ్వాదం.. పుట్టింటివారితో కలిసి భర్తపై దాడి

Sangeeta Argument Over Samosas Leads to Assault in Pilibhit
  • పుట్టింటి వారిని పిలిపించి భర్త, మామపై దాడి
  • పంచాయితీతోనూ పరిష్కారం కాని వివాదం
  • భార్య, ఆమె తల్లిదండ్రులపై పోలీసులకు ఫిర్యాదు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
సమోసా తీసుకురాలేదన్న చిన్న కారణం ఓ కుటుంబంలో పెద్ద గొడవకు దారితీసింది. భార్య తన పుట్టింటి వారితో కలిసి భర్త, మామపై దాడి చేయడంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. ఉత్తర ప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

పిలిభిత్‌ జిల్లా పురన్‌పూర్ పరిధిలోని ఆనంద్‌పూర్ గ్రామానికి చెందిన శివమ్‌కు, సెహ్రామౌ నార్త్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన సంగీతతో ఈ ఏడాది మే 22న వివాహం జరిగింది. ఆగస్టు 30వ తేదీన, సంగీత తన భర్త శివమ్‌ను పని నుంచి తిరిగి వచ్చేటప్పుడు సమోసాలు తీసుకురమ్మని కోరింది. అయితే, శివమ్ సమోసాలు తీసుకురావడం మరిచిపోయి ఇంటికి వచ్చాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సంగీత భర్తతో గొడవకు దిగింది. ఆ రాత్రి భోజనం కూడా చేయకుండా వాగ్వాదానికి దిగింది.

మాటామాటా పెరగడంతో, సంగీత తన తల్లిదండ్రులైన ఉష, రామ్‌లదాతేలను ఇంటికి పిలిపించింది. అనంతరం ముగ్గురూ కలిసి శివమ్‌తో పాటు అతని తండ్రి విజయ్ కుమార్‌పై దాడి చేసి దూషించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ గొడవ తర్వాత, మరుసటి రోజు (ఆగస్టు 31) గ్రామ మాజీ సర్పంచ్ అవధేష్ శర్మ సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.

దీంతో, విజయ్ కుమార్ సెప్టెంబర్ 1న పురన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో తన కోడలు సంగీత, ఆమె తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశారు. తన కుమారుడు సమోసాలు తీసుకురావడం మర్చిపోయినందుకే వారు ఈ దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని పిలిభిత్ పోలీసులు తెలిపారు.
Sangeeta
Pilibhit district
Uttar Pradesh
domestic dispute
samosa
family fight
police investigation

More Telugu News