Jangam Baji: యూట్యూబ్ చూసి మెరుపుదొంగలా మారాడు... చివరికిలా చిక్కాడు!

Guntur Police Solve Theft Cases as Jangam Baji Arrested
  • యూట్యూబ్ చూసి చోరీలు నేర్చుకున్న దొంగ అరెస్ట్
  • కార్ల అద్దాలు పగలగొట్టి దొంగతనాలు చేయడమే టార్గెట్
  • పల్నాడు జిల్లాకు చెందిన జంగం బాజీగా గుర్తింపు
  • నిందితుడిపై గతంలో హత్య కేసు, రౌడీషీట్
  • 6 ల్యాప్‌టాప్‌లు, రూ.2 లక్షల నగదు, బంగారం స్వాధీనం
  • గత మూడు నెలల్లో 10 చోరీలకు పాల్పడిన నిందితుడు
టెక్నాలజీని మంచికి వాడుకునే వారు కొందరైతే.. నేరాలకు మార్గంగా ఎంచుకునే వారు మరికొందరు. సరిగ్గా ఇదే కోవలో యూట్యూబ్ వీడియోలను గురువుగా మార్చుకుని, కారు అద్దాలు పగలగొట్టి మెరుపువేగంతో చోరీలు చేయడంలో ఆరితేరిన ఓ కేటుగాడిని గుంటూరు నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.

పల్నాడు జిల్లా నాదెండ్ల మండలానికి చెందిన జంగం బాజీ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించినట్లు ఆయన తెలిపారు. నిందితుడికి పాత నేరచరిత్ర ఉందని, అతనిపై గతంలో ఓ హత్య కేసుతో పాటు రౌడీషీట్ కూడా ఉందని ఎస్పీ వివరించారు. నిందితుడు కొంతకాలంగా యూట్యూబ్ వీడియోలు చూస్తూ కారు అద్దాలను సులభంగా ఎలా పగలగొట్టాలి, లోపలున్న విలువైన వస్తువులను క్షణాల్లో ఎలా దొంగిలించాలి అనే విషయాలపై పట్టు సాధించాడు.

గత మూడు నెలల కాలంలో నిందితుడు సుమారు 10 దొంగతనాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. జిల్లాలో వరుసగా జరుగుతున్న ఈ తరహా చోరీలపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ మరియు ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్నారు. అతని నుంచి 6 ల్యాప్‌టాప్‌లు, 11 గ్రాముల బంగారం, రూ. 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

నిందితుడిపై ఇప్పటికే 9 కేసులు నమోదై ఉన్నాయని, ఈ అరెస్టుతో జిల్లాలో వరుస దొంగతనాలకు అడ్డుకట్ట పడిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం కేసుపై తదుపరి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు వెల్లడించారు.
Jangam Baji
Guntur
Youtube theft
car glass break
laptop theft
gold theft
Andhra Pradesh crime
Nallapadu police
cyber crime
Palnadu district

More Telugu News