K Narayana: బీజేపీ ఒక భస్మాసుర హస్తం.. ఆ పార్టీతో జతకట్టిన పార్టీలు అంతమవుతాయి: నారాయణ

K Narayana comments on BJP alliances
  • బీజేపీతో కలిస్తే బీఆర్ఎస్ మాదిరిగానే చీలిపోతారన్న నారాయణ
  • టీడీపీ, జనసేనకు కూడా బీఆర్ఎస్ గతే పడుతుందని జోస్యం
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఉద్దేశపూర్వకంగానే చంపేస్తున్నారని విమర్శ
బీజేపీ ఒక భస్మాసుర హస్తం లాంటిదని, ఆ పార్టీతో కలిసిన ఏ రాజకీయ పక్షమైనా అంతరించిపోవడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ రెండుగా చీలిపోవడాన్ని ఉదాహరణగా చూపుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ, జనసేన పార్టీలకు కూడా భవిష్యత్తులో ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు.

ఏపీలోని రాజకీయ పార్టీలు ప్రధాని మోదీకి దాసోహం అయ్యాయని నారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి కేంద్రానికి సాగిలపడుతున్నాయని దుయ్యబట్టారు. ముఖ్యంగా, విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కొందరు కావాలనే ప్లాంట్ ను దెబ్బతీసి, నష్టాల్లోకి నెట్టి.. ఆ తర్వాత స్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర అని ఆయన అభిప్రాయపడ్డారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై కూడా నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. జీఎస్టీ పేరుతో బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను నిలువునా లూటీ చేసిందని ఆరోపించారు. తొమ్మిదేళ్ల పాటు కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టి, ఇప్పుడు ఎన్నికల ముందు జీఎస్టీలో మార్పులు చేయడం ప్రజలను మోసగించడమేనని మండిపడ్డారు. జీఎస్టీ స్వరూపాన్ని పూర్తిగా మార్చాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు మరిన్ని ఇబ్బందులు పడతారని ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మోదీ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. 

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపైనా నారాయణ మండిపడ్డారు. నక్సల్స్‌ను చంపుతామని అమిత్ షా అంటున్నారని, కానీ వారిని చంపడం ద్వారా వారి సిద్ధాంతాన్ని ఎలా మారుస్తారని ప్రశ్నించారు. గిరిజనుల ఆస్తులను కాజేయడానికే నక్సల్స్ ఏరివేత పేరుతో నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని, వ్యతిరేక గళం వినిపించిన వారిని 'ఆపరేషన్ ఖగార్' పేరుతో అడ్డు తొలగించుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
K Narayana
CPI
BJP
Bhasmasura Hastam
TDP
Janasena
Visakha Steel Plant
GST
Amit Shah
Naxalites

More Telugu News