Ganesh Nimajjanam: గణేశ్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఒంటిగంట వరకు మెట్రో సేవలు

Ganesh Nimajjanam Hyderabad Metro services extended till 1 AM
  • అన్ని మెట్రో స్టేషన్ల నుంచి అందుబాటులో మెట్రో సేవలు
  • ఉదయం 6 నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు
  • నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేవారికి మేలు
భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త తెలిపింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు అన్ని మెట్రో స్టేషన్ల నుంచి మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. నిమజ్జనం చూసేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

రేపటి నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి: హైదరాబాద్ సీపీ

రేపటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి సమావేశాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వినాయక నిమజ్జనాలకు సంబంధించి చెరువులను అన్నింటిని పరిశీలించినట్లు చెప్పారు.

ట్యాంక్‌బండ్, హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ ఘాట్ వద్ద 40 క్రేన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసుల సూచనల మేరకు మండపాల నుంచి బయల్దేరాలని సూచించారు. వాహనాలు, విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల అనుమతితో నిమజ్జనానికి తీసుకువెళ్లాలని అన్నారు. హైదరాబాద్‌లో ప్రతి ప్రాంతంపై మ్యాప్ వేసుకుని మార్గాలను నిర్ణయించామని తెలిపారు. మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు పాటించాలన్నారు.

రోడ్లపై డైవర్షన్ ఉన్నచోట్ల బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట లోపు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేస్తామని తెలిపారు. 29 వేల మందితో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నామని అన్నారు. శనివారం సుమారు 50 వేల విగ్రహాల నిమజ్జనాలు జరుగుతాయని అంచనా వేశారు.
Ganesh Nimajjanam
Hyderabad Metro
CV Anand
Ganesh Chaturthi
Hyderabad CP
Tank Bund

More Telugu News