Donald Trump: మాట మార్చిన ట్రంప్.. ఏడు కాదు, మూడు యుద్ధాలే ఆపాడట!

Trump Revises Claim Says Stopped Three Wars Not Seven
  • ఏడు యుద్ధాలు ఆపానని ఇప్పటి వరకు చెప్పుకున్న ట్రంప్
  • వైట్‌హౌస్‌లో టెక్ దిగ్గజాల విందులో కీలక వ్యాఖ్యలు
  • మూడు యుద్దాలు ఆపానన్న అమెరికా అధ్యక్షుడు
తనను తాను గొప్ప శాంతి దూతగా అభివర్ణించుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన పాత వ్యాఖ్యలను తానే సవరించుకున్నారు. తాను ఏడు దేశాల మధ్య యుద్ధాలను ఆపానని గతంలో పదేపదే చెప్పుకున్న ఆయన, తాజాగా ఆ సంఖ్యను మూడుకు తగ్గించారు. వైట్‌హౌస్‌లో టెక్నాలజీ సంస్థల అధినేతలకు ఇచ్చిన విందు సందర్భంగా ట్రంప్ ఈ కొత్త ప్రకటన చేశారు.

వివరాల్లోకి వెళితే, వైట్‌హౌస్‌లో టెక్ కంపెనీల సీఈవోలతో సమావేశమైన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఎలా ముగిస్తారని ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ, "మీకు తెలుసా? నేను ఇప్పటివరకు మూడు యుద్ధాలను ఆపాను" అని ట్రంప్ పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్న దేశాల మధ్య తాను శాంతిని నెలకొల్పానని, అది అసాధ్యమని చాలామంది చెప్పినా తాను చేసి చూపించానని అన్నారు. అయితే, ఆ మూడు యుద్ధాలు ఏవనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం క్లిష్టంగా మారినప్పటికీ, దాన్ని కూడా తాను కచ్చితంగా ఆపుతానని ధీమా వ్యక్తం చేశారు.

థాయ్‌లాండ్‌ -కంబోడియా, ఇజ్రాయెల్‌-ఇరాన్‌, ఇజ్రాయెల్‌-హమాస్‌, రువాండా-డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో, సెర్బియా-కొసావో, ఈజిప్ట్‌-ఇథియోపియా, ఇండియా-పాకిస్థాన్ మధ్య ట్రంప్ యుద్ధాలు ఆపినట్టు వైట్ హౌస్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ లాంటి దేశాలు ఆయనను నోబెల్ శాంతి బహుమతికి కూడా నామినేట్ చేశారు.

ఇక, భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలను కూడా తానే తగ్గించానని గతంలో ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు. అయితే, భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ వచ్చింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో దేశం ప్రమేయం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పష్టం చేశారు. ఇప్పుడు ట్రంప్ తన పాత లెక్కను మార్చి, ఏడు నుంచి మూడుకు తగ్గించడం చర్చనీయాంశంగా మారింది. 
Donald Trump
US President
Russia Ukraine war
Trump Peace efforts
India Pakistan tensions
White House
International relations
Nobel Peace Prize

More Telugu News