AP Government: 2309 విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం.. గ్రామీణ ఆరోగ్యానికి పెద్దపీట

AP Government Approves 2309 Village Health Clinics
  • ప్రతి హెల్త్ క్లినిక్ కు రూ. 55 లక్షలు ఖర్చు
  • భవన నిర్మాణానికి రూ. 42 లక్షల కేటాయింపు
  • ప్రహరీ గోడ, నీటి సరఫరా, విద్యుత్ తదితరాలకు రూ. 13 లక్షలు
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ వైద్య సేవలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,309 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల (ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు) నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద రూ.217.10 కోట్ల నిధులను విడుదల చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

వీటికి అదనంగా, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) పథకం కింద మరో 696 కొత్త భవనాల నిర్మాణానికి కూడా అనుమతి లభించింది. ప్రతి హెల్త్ క్లినిక్ యూనిట్ నిర్మాణానికి మొత్తం రూ.55 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఇందులో భవన నిర్మాణం కోసం రూ.42 లక్షలు కేటాయించగా, ప్రహరీ గోడ, నీటి సరఫరా, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కోసం మరో రూ.13 లక్షలు వినియోగించనున్నారు.

గ్రామీణ, ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో నివసించే నిరుపేద ప్రజలకు మెరుగైన, సులభతరమైన వైద్య సేవలను అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ క్లినిక్‌ల ద్వారా ప్రజలకు ఆరోగ్య సమస్యలు రాకుండా నివారించవచ్చని, అదే సమయంలో ఆరోగ్య సంబంధిత అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలు కలుగుతుందని వారు భావిస్తున్నారు. 
AP Government
Andhra Pradesh
Village Health Clinics
Ayushman Bharat
National Health Mission
Rural Healthcare
PM-ABHIM
Healthcare Infrastructure
AP Health
Rural Health

More Telugu News