Alia Bhatt: కూతురి కోసం కీలక నిర్ణయం తీసుకున్న అలియా భట్!

Alia Bhatt Changes Movie Genres for Daughter Raha
  • కూతురు రాహా కోసం జోనర్ మార్చుకుంటున్న అలియా భట్
  • ఇకపై తేలికపాటి కామెడీ సినిమాలకే ప్రాధాన్యత ఇస్తానని వెల్లడి
  • రాహా చూసి నవ్వుకునే చిత్రాలు చేయాలన్నదే తన కోరికని కామెంట్
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తన కెరీర్ విషయంలో ఓ ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు నటిగా బిజీగా ఉంటూనే, కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చే ఆమె, తన గారాల పట్టి రాహా కోసమే ఈ మార్పు చేసుకోబోతున్నట్టు వెల్లడించారు. భవిష్యత్తులో తాను నటించే సినిమాల జోనర్‌ను పూర్తిగా మార్చనున్నట్లు స్పష్టం చేశారు.

ఇప్పటివరకు 'గంగూబాయి కతియావాడి', 'రాజీ' వంటి సీరియస్ చిత్రాలతో నటిగా ఎన్నో ప్రశంసలు అందుకున్న అలియా, ఇకపై తేలికపాటి కామెడీ కథలను ఎంచుకోవాలని భావిస్తున్నట్టు తెలిపారు. దీనికి ప్రధాన కారణం తన కుమార్తె రాహా అని ఆమె పేర్కొన్నారు. "ఇప్పటివరకు నా కూతురు రాహా చూసి ఆనందించే ఒక్క సినిమా కూడా నేను చేయలేదు. అందుకే భవిష్యత్తులో తను చూసి నవ్వుకునేలాంటి ఒక సినిమా ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నా. నా కూతురే నా జోనర్ మార్పుకు కారణం. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులను అంగీకరించాను, వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను" అని అలియా వివరించారు.

ప్రస్తుతం తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి 'లవ్ అండ్ వార్' చిత్రంలో నటిస్తున్న అనుభవాలను కూడా ఆమె పంచుకున్నారు. షూటింగ్, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడంపై మాట్లాడుతూ.. "మేమిద్దరం షూటింగ్‌లో ఉన్నప్పుడు రాహాను చూసుకోవడం కాస్త సవాలుగా ఉండేది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా రాత్రి సమయాల్లోనే జరిగింది. దీంతో పగలంతా రాహాతో గడిపి, రాత్రిపూట షూటింగ్‌కు హాజరయ్యాం. కొన్నిసార్లు రాహా సెట్స్‌కు వచ్చి మాతో సరదాగా గడిపేది" అని ఆమె తెలిపారు.
Alia Bhatt
Alia Bhatt movies
Ranbir Kapoor
Love and War movie
Bollywood actress
Raha Kapoor
Comedy movies
Bollywood news
Gangubai Kathiawadi
Raazi

More Telugu News