IMD: ఏపీలో మళ్లీ పెరగనున్న ఎండలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

IMD Issues Heatwave Warning for Andhra Pradesh
  • రాష్ట్రంలో మళ్లీ పెరగనున్న వేడి, ఉక్కపోత
  •  కోస్తాంధ్రలో 10వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు
  • సాధారణం కంటే 5 డిగ్రీల వరకు పెరిగే అవకాశం
  • ఆ తర్వాత రాష్ట్రంలో జోరందుకోనున్న వర్షాలు
  • అక్కడక్కడ 3 రోజులపాటు వర్షాలు పడే అవకాశం 
  • ఇప్పటికే పలు ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రతలు
ఏపీ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) కీలక హెచ్చరిక జారీ చేసింది. రాబోయే కొన్ని రోజుల పాటు వేడి, ఉక్కపోత తీవ్రత గణనీయంగా పెరగనుందని స్పష్టం చేసింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ నెల 10వ తేదీ వరకు కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 3.1 నుంచి 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, ఈ నెల 12 నుంచి 18 మధ్య ఉత్తర కోస్తాలో కూడా ఎండల తీవ్రత పెరగవచ్చని పేర్కొంది. నిన్న నరసాపురం, బాపట్ల, కావలి వంటి ప్రదేశాలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.

ఒకవైపు ఎండల తీవ్రతపై హెచ్చరికలు ఉన్నప్పటికీ, మరోవైపు వర్ష సూచన కాస్త ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు వాతావరణ నమూనాల ప్రకారం ఈ నెల 10 తర్వాత వర్షాలు మళ్లీ జోరందుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
IMD
Andhra Pradesh weather
AP weather forecast
Heatwave alert
Coastal Andhra Pradesh
Amaravati Meteorological Center
Rain forecast
Narsapuram
Bapatla
Kavali

More Telugu News